Soubin Shahir: పూజా పాపనే డామినేట్ చేశాడు.. ఎవర్రా ఈ సౌబిన్ షాహిర్
ABN, Publish Date - Jul 14 , 2025 | 04:00 PM
గత మూడు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు సౌబిన్ షాహిర్ (Soubin Shahir). అసలు ఎవరితను అంటే.. మలయాళ నటుడు.
Soubin Shahir: ఒక హీరోకు కానీ, హీరోయిన్ కి కానీ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేసినా ఒక్క సినిమా మాత్రం కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోతుంది. వారి పేరు చెప్పగానే అందరికీ ఆ సినిమా పేరునే గుర్తొస్తుంది. అయితే ఈమధ్యకాలంలో సినిమాలు మాత్రమే కాదు ఒక్క సాంగ్ చేసినా కూడా అంతే పేరు తెచ్చుకుంటున్నారు స్టార్స్. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా రాని పేరు.. ఒక్క సాంగ్ తో సంపాదించుకుంటున్నారు. గత మూడు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు సౌబిన్ షాహిర్ (Soubin Shahir). అసలు ఎవరితను అంటే.. మలయాళ నటుడు. ఎందుకు ఇప్పుడు ఈయన గురించే చర్చ అంటే.. కూలీ (Coolie) సినిమాలో మోనికా.. లవ్ యూ మోనికా అంటూ పూజా హెగ్డే(Pooja Hegde)తో పాటు డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఫిదా చేయడం కాదు షాక్ కు గురిచేశాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కూలీ. సన్ పిక్చర్స్ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ అందరూ నటిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర,అమీర్ ఖాన్.. ఇలా స్టార్స్ అందరూ రజినీ కోసం రంగంలోకి దిగారు. ఇక వీరు మాత్రమే అయితే ఎలా రజినీ సినిమా అంటే ఇంకా హైప్ ఉండాలనే ఉద్దేశంతో లోకేష్.. ఒక స్పెషల్ సాంగ్ కోసం హాట్ బ్యూటీ పూజా హెగ్డేని దింపాడు. అమ్మడు చేసిన ప్రతి ఐటెంసాంగ్ హిట్టే. ఇక ఇప్పుడు ఈ సాంగ్ కూడా హిట్టే.
ఏ స్పెషల్ సాంగ్ లో అయినా హీరోయినే హైలైట్. ఆమె అందాలు.. హావభావాలు.. స్టెప్స్ అందరూ ఇవి చూడడానికే వస్తారు. కానీ మోనికా సాంగ్ లో పూజానే డామినేట్ చేశాడు సౌబిన్. ఆమె అందం కన్నా ఎక్కువగా సౌబిన్ డ్యాన్స్ కు ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఒక్క సాంగ్ తోనే సౌబిన్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అదేంటి.. అంతకుముందు సౌబిన్ చాలా సినిమాలు తీసాడు.మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ఎప్పుడో స్టార్ కదా అనే డౌట్ రావచ్చు. మలయాళంలో సౌబిన్ అందరికీ తెలుసు కానీ, తెలుగు, తమిళ్ లో ఈ సాంగ్ తోనే ఈ నటుడు ఫేమస్ అయ్యాడు.
ఇండస్ట్రీలోకి రావాలంటే అందం ఉండాలి.. జుట్టు ఉండాలి.. బాడీ ఉండాలి అని అనుకొనేవారందరికీ అలాంటివేమీ లేకున్నా టాలెంట్ ఉంటే చాలువిజయం వరిస్తుంది అని నిరూపించిన నటుల్లో సౌబిన్ కూడా ఒకడు. బట్టతల, వయస్సు పైబడినవాడిలా ఉండే ముఖం. పళ్ల మధ్య గ్యాప్.. ఎవరైనా ఇలాంటివాడిని హీరోగా అనుకుంటారా.. ? కానీ, సౌబిన్ నటన చూస్తే ఇవేమి ప్రేక్షకులకు కనిపించవు. అసలు సౌబిన్ ఎలా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అంటే.. వారిది సినీ నేపథ్యం ఉన్న కుటుంబమే. సౌబిన్ తండ్రి ఒక అసిస్టెంట్ డైరెక్టర్. ఎన్నో హిట్ మలయాళ సినిమాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. తండ్రిను చూసి సౌబిన్ కూడా సినిమాల్లోకి రావాలనుకున్నాడు.
చీఫ్ అసోసియేటెడ్ డైరెక్టర్ అవ్వాలని కలలు కంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సౌబిన్. దొరికిన పాత్రలు చేస్తూ వచ్చాడు. ఇక అతని జీవితాన్ని మార్చేసింది ప్రేమమ్ సినిమా. నివిన్ పౌలీ, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాలో పీటీ మాస్టర్ గా సౌబిన్ నటించి మెప్పించాడు. ఈ సినిమాతో అతడి దశ తిరిగింది. ఆ తరువాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. నటుడిగానే కాకుండా హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. రోమాంచమ్, మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలు సౌబిన్ ను తెలుగువారికి కూడా దగ్గర చేశాయి.
సౌబిన్ నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవ్వడం మొదలుపెట్టాయి. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టిన సౌబిన్.. ఇప్పుడు స్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు కూలీ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు నటనతోనే మెప్పించిన ఈ నటుడు.. మోనికా సాంగ్ లో డ్యాన్స్ కూడా అదరగొట్టేశాడు. అసలు హీరోలకు ధీటుగా ఈ వయస్సులో ఇంత ఎనర్జీగా డ్యాన్స్ వేయడం ఆషామాషీ విషయం కాదు. ఆ గ్రేస్ కానీ, హావభావాలు కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ ఒక్క సాంగ్ తో సౌబిన్ ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయాడు. ప్రస్తుతం మోనికా సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. మరి ఈ సినిమా సౌబిన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలంటే ఆగస్టు 14 వరకు ఆగాల్సిందే.