Vishal: దర్శకుల సంఘం సీరియస్.. ఆగిన విశాల్ 'మకుటం'
ABN , Publish Date - Oct 31 , 2025 | 01:11 PM
విశాల్ తాజా చిత్రం 'మకుటం' చిక్కుల్లో పడింది. దర్శకుడు రవి అరసును ప్రాజెక్ట్ నుండి తప్పించడంపై దర్శకుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ప్రముఖ తమిళ కథానాయకుడు విశాల్ (Vishal) తాజా చిత్రం 'మకుటం' (Makutam) కు దర్శకుల సంఘం మోకాలడ్డింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై ఆర్.బి. చౌదరి (R.B. Chowdary) నిర్మిస్తున్న ఈ 99వ సినిమాకు ఊహకందని అవాంతరాలు వచ్చిపడ్డాయి. ఈ సినిమాను రవి అరసు (Ravi Arasu) దర్శకత్వంలో మొదలు పెట్టారు. అయితే దాదాపు యాభై శాతం షూటింగ్ జరిగిన తర్వాత దర్శకుడు రవికి, హీరో విశాల్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దాంతో రవిని ప్రాజెక్ట్ నుండి తప్పించేశారు.
దీపావళి సందర్భంగా విశాల్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియచేశాడు. ఈ ప్రారంభం నుండి తానే డీల్ చేస్తున్నానని, రవితో వచ్చిన ఇబ్బందుల కారణంగా ఇప్పుడు ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో టేకోవర్ చేశానని, నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి. చౌదరి ఇబ్బంది పడకూడదనే దర్శకుడిగా పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నానని చెప్పాడు. ఆర్.బి. చౌదరి సైతం ఇక చేసేది ఏమీ లేక విశాల్ పక్షాన నిలిచినట్టు తెలిసింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకటి జరిగింది.
విశాల్ 'మకుటం' ప్రాజెక్ట్ నుండి రవి అరసు తప్పించానని అనుకున్నారు కానీ తమిళనాట బలంగా ఉన్న దర్శకుల సంఘం మాత్రం దానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. అలానే పెప్సీ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా) సైతం 'మకుటం' షూటింగ్ జరగడానికి వీల్లేదంటోంది. ఒకవేళ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కావాలంటే... దర్శకుడు రవి అరసు నుండి 'నో అబ్జక్షన్' సర్టిఫికెట్ తీసుకోవాలని చెబుతోంది. మరి ఈ నేపథ్యంలో రవి అరసు ఎలాంటి డిమాండ్స్ చేస్తాడో తెలియదు. చిత్రం ఏమంటే... ఇలాంటి పరిస్థితి గతంలోనూ విశాల్ కు ఎదురయ్యింది.
మిస్కిన్ (Mysskin) దర్శకత్వంలో విశాల్ నటించిన 'తుప్పరివాలన్' (Thupparivaalan) మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇది తెలుగులో 'డిటెక్టివ్' పేరుతో డబ్ కూడా అయ్యింది. దానికి సీక్వెల్ చేయాలని విశాల్, మిస్కిన్ అనుకున్నారు. 'తుప్పరి వాలన్ 2'ను అధికారికంగా ప్రకటించారు. కానీ విశాల్ కు, మిస్కిన్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. 'తుప్పరివాలన్ -2'ను తానే డైరెక్ట్ చేస్తానని, మిస్కిన్ కు ఆ ప్రాజెక్ట్ తో సంబంధం లేదని విశాల్ ప్రకటించాడు. కానీ అప్పుడు కూడా పెప్సీ, దర్శకుల సంఘాలు ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగకుండా అడ్డుకున్నాయి. మరి ఇప్పుడు 'మకుటం' ప్రాజెక్ట్ విషయంలో అయినా దర్శకుడిని బుజ్జగించి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందుతారో లేదో చూడాలి.
Also Read: The Paradise: హాలీవుడ్ కు నాని 'ది ప్యారడైజ్'.. ప్రజంటర్ గా 'డెడ్ ఫూల్' హీరో
Also Read: Bahubali: The Epic Review: బాహుబలి: ది ఎపిక్ ఎలా ఉందంటే