Bahubali: The Epic Review: బాహుబలి: ది ఎపిక్ ఎలా ఉందంటే
ABN , Publish Date - Oct 31 , 2025 | 08:30 AM
దర్శకధీరుడు, ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసింది. బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రెండు చిత్రాలను ఒకలి కాస్త నిడివి తగ్గించి ‘బాహుబలి: ద ఎపిక్’ పేరుతో రూపొందించారు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్.
సినిమా రివ్యూ: బాహుబలి: ది ఎపిక్
విడుదల తేది: 31-10-2025
థియేటర్: ప్రసాద్స్ పీసీఎక్స్ స్క్రీన్
నిడివి: 3 గంటల 45 నిమిషాలు
దర్శకధీరుడు, ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసింది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్కాశెట్టి, రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రధారులుగా ఆర్కా మీడియా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదలైంది. మొదటి పారు ‘బాహుబలి- ధ బిగినింగ్’ 2015లో విడుదల కాగా, రెండోపార్టు ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ 2017లో విడుదలైంది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. బాహుబలి విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రెండు చిత్రాలను ఒకలి కాస్త నిడివి తగ్గించి ‘బాహుబలి: ద ఎపిక్’ పేరుతో రూపొందించారు. 5.40 నిమిషాల నిడివి గల రెండు భాగాలను ఎడిట్ చేసి 3.45 నిమిషాల నిడివికి కుదించి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చారు మేకర్స్.
కథ:
'బాహుబలి' రెండు పార్టులు చూసిన వారికి కథేమీ చెప్పక్కర్లేదు. అయినా క్లుప్తంగా కథ ఇది.
మాహిష్మతి సామ్రాజ్యానికి మహారాజు కావాలని భల్లాలదేవుడు (రానా) కలలు కంటాడు. ప్రజల మంచి కోరి, జనాదరణ పొందిన సోదరుడు అమరేంద్ర బాహుబలి (ప్రభాస్)ని తండ్రి బిజ్జలదేవ(నాజర్)తో కలిసి కుట్రపన్ని చంపుతాడు. ఆ కుట్రలో మాహిష్మతి కట్టుబానిస కట్టప్ప (సత్యరాజ్)తో పాటు రాజమాత శివగామి (రమ్యకృష్ణ) కూడా ఇరుక్కుంటారు. అయితే అమరేంద్ర వారసుడు మహేంద్ర బాహుబలి ని రాజమాత ఎలా కాపాడుతుంది? ఆ పిల్లవాడు పెరిగి పెద్దై ఎలా తన తల్లి దేవసేన (అనుష్క)ని, రాజ్యాన్ని ఎలా భల్లాల చెర నుంచి విడిపించాడు? అన్నదే కథాంశం…

విశ్లేషణ:
‘బాహుబలి’ రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఆ కోరికను రాజమౌళి అండ్ టీమ్ నెరవేర్చింది. ఈ క్రమంలో ఏయే సన్నివేశాలకు కత్తెర పడింది.. ఏ సీన్స్ అదనంగా యాడ్ అవుతాయనే ఆసక్తి  ఆడియన్స్ లో ఏర్పడింది. అయితే నిడివి తగ్గించి విజువల్ గా , సౌండ్ పరంగా కొత్త హంగులు జోడించిన ఈ మూవీలో ఒకే ఒక్క అదనపు సన్నివేశాన్ని జోడించారు. అదే శివుడు అవంతికను కాపాడిన సందర్భంలో ఓ సిపాయి బాహుబలిని చూశానని చెప్పినపుడు బాహుబలిని ఎప్పుడే పంచభూతాల్లో కలిపేశామని బిజ్జల దేవ పాత్రధారి నాజర్ చెప్పే సీన్.  మిగిలిన దానిలో కుదింపు మాత్రమే ఉంది కానీ అదనంగా జోడించిన సన్నివేశాలు ఏవీ లేవు. అయితే అవంతిక (తమన్నా)తో లవ్ ట్రాక్ ని కుదించి వారి ప్రేమ కథను రాజమౌళి వాయిస్ ఓవర్లో వినిపించారు. ఇక ‘మమతల తల్లి’,  ‘పచ్చబొట్టేసినా’, ‘మనోహరి..’ పాటలకు కత్తెర వేశారు. కాలకేయులపై వార్ సీన్స్ బాగా ట్రిమ్ చేశారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియడానికి రెండేళ్ల సమయం అవసరం లేదంటూ ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.
  
ఇక రెండో భాగంలో రవిశంకర్ వాయిస్ తో బాహు, భల్లాలదేవుడి కథను కొంత తెలియచేశారు. ఇక కుమార్ వర్మ సీన్స్, 'కన్నా నిదురించరా' సాంగ్, పిండారీల యుద్దం, క్లైమాక్స్ ఫైట్ ను ట్రిమ్ చేశారు. సినిమా ఆసాంతం ఎక్కడ కంటిన్యుటీ మిస్ కాకుండా అన్ని రకాలుగా జాగ్రత్త పడ్డారు. టెక్నికల్ గా చేసిన మార్పులతో మాహిష్మతి అందాలు మరింత కొత్తగా కనిపించాయి. డాల్మీ అట్మాస్ గతంలో కంటే ఇప్పుడు సౌండింగ్ పరంగా చాలా బావుంది. అట్మాస్ లో కీరవాణి సంగీతం మరింత అద్భుతంగా ఎలివేట్ అయింది. నిజం చెప్పాలంటే కీరవాణి సంగీతమే కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసింది. పదేళ్ల క్రితం సినిమా చూసి ఆ తర్వాత టీవీ, ఓటీట్లో పదే పదే చూసిన వారు కూడా థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు. కానీ రీ-రిలీజ్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్న ఫ్యాన్స్ మాత్రం మళ్లీ మళ్లీ చూస్తారు.
ట్యాగ్ లైన్: మాహిష్మతి ఎగైన్  
రేటింగ్: 3.25