Vijay Antony: డాక్టర్ నుండి లాయర్ గా మారిన హీరో...

ABN , Publish Date - May 20 , 2025 | 11:08 AM

కథానాయకుడిగా వైవిధ్యమైన పాత్రలను చేస్తున్న విజయ్ ఆంటోని ఇప్పుడు లాయర్ అవతారం ఎత్తబోతున్నాడు. అతని తాజా చిత్రానికి 'లాయర్' అనే పేరు ఖరారు చేశారు.

ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగానూ తన సత్తాను చాటుతున్నారు. 'నకిలీ' (Nakili) సినిమాతో హీరోగా మారి... ఇప్పటి వరకూ పాతిక చిత్రాలలో నటించారు. ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యి ఇక్కడ కూడా ఘన విజయాలను సాధించాయి. ముఖ్యంగా 'బిచ్చగాడు' (Bichchagadu) సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. నటుడిగా, సంగీత దర్శకుడిగా, అడపాదడపా దర్శకుడిగానూ తన ప్రతిభను వెలికి తీస్తున్నారు విజయ్ ఆంటోని. ఆయన నటించిన 'గగన మార్గన్' సినిమా... జూన్ 27న 'మార్గన్' (Maargan) పేరుతో తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. అలానే విజయ్ ఆంటోని నటించిన 25వ చిత్రం 'భద్రకాళి' (Bhadrakali) ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది. అరుణ్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో 'శక్తి తిరుమగన్' పేరుతో రూపుదిద్దుకుంది. 190 కోట్ల కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.


ఇదిలా ఉంటే... విజయ్ ఆంటోని తన 26వ చిత్రం పేరును తాజాగా ప్రకటించాడు. దీనికి 'లాయర్' (Lawyer) అనే పేరు పెట్టారు. తమిళ, తెలుగు, కన్నడ పాటు హిందీలోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. జూన్ లో షూటింగ్ మొదలవుతుందని, జోషువా సేతు రామన్ దీనికి దర్శకత్వం వహించబోతున్నారని విజయ్ ఆంటోని తెలిపారు. టైటిల్ తో పాటు విడుదల చేసిన ప్రీలుక్ పోస్టర్ లో 'న్యాయానికి ఒక పేరు ఉంది' అనే కాప్షన్ పెట్టారు. అలానే పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, 'యుద్థం మొదలైంది... కానీ పిడికిలితో కాదు... వాస్తవాలతో' అనే కాప్షన్ పెట్టారు. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా దీనిని నిర్మిస్తోంది. ఇతర నటీనటులు సాంకేతిక వర్గం వివరాలను ప్రకటించాల్సి ఉంది. మరి డాక్టర్ గా, బిచ్చగాడిగా, గ్యాంగ్ స్టర్ గా... రకరకాల పాత్రలతో మెప్పించిన విజయ్ ఆంటోని లాయర్ గా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Also Read: Megastar: చిరంజీవితోనే రీ-ఎంట్రీ...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 20 , 2025 | 01:08 PM