Babu: సీనియర్ సినిమాటోగ్రాఫర్.. బాబు కన్నుమూత
ABN, Publish Date - Oct 12 , 2025 | 07:54 AM
45 చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సీనియర్ కెమెరామెన్ బాబు (88) శనివారం వృద్దాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.
సీనియర్ డైరెక్టర్ ఎస్పీ ముత్తు రామన్ దర్శకత్వం వహించిన 45 చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ (cinematographer)గా పని చేసిన సీనియర్ కెమెరామెన్ బాబు (88) (Babu)శనివారం వృద్దాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. బాబు అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కెమెరామెన్‌గా కేఎస్ ప్రసాద్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన. నాటి అగ్రనటులైన ఎంజీ ఆర్, శివాజీ గణేశన్ చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేశారు. తమిళం, హిందీ భాషలతో పాటు సూపర్‌స్టార్ రజనీకాం త్ నటించిన అనేక చిత్రాలకు ఆయన సినిమాటోగ్రాఫర్గా పని చేశారు. వీటిలో 'ప్రియ', 'మురట్టుకాలై', 'నల్లవనుక్కు నల్లవన్, 'పాయం పులి', 'కళుగు', పోకిరి రాజా' తదితర చిత్రాలు ఉన్నాయి.
విశ్వనటుడు కమల్ నటించిన సకలకలా వల్లవన్, 'తూంగాదే తంబి తూంగాదే' వంటి అనేక చిత్రాలకు ఛాయాగ్రహణం సమకూర్చారు. 2001లో ప్రభు నటించిన 'తాళికాత్త కాళి అమ్మన్' చిత్రం ఆయన సినిమాటోగ్రఫీ చేసిన ఆఖరి చిత్రం. స్థానిక చెన్నై అభిరామిపురం కృష్ణస్వామి వీధిలోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటూ వచ్చిన ఆయన వృద్ధాప్య కారణంగా సోమవారం అనారోగ్యానికి గురయ్యారు.
దీంతో ఆళ్వార్ పేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఈక్రమంలో శనివారం కన్నుమూశారు. ఆయనకు విశ్వనాథ్, శ్రీధర్ అనే ఇద్దరు కుమారులున్నారు. భార్య గతంలోనే భౌతికంగా దూరమయ్యారు. కెమెరామెన్ బాబు మృతిపై సీనియర్ దర్శకుడు ఎస్పీ ముత్తు రామన్ సహా అనేక మంది సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు.