Vijay Devarakonda: 'కింగ్ డమ్' కు భారీ ఓపెనింగ్స్ ఖాయం
ABN , Publish Date - Jul 29 , 2025 | 10:44 PM
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా 'కింగ్ డమ్'. ఈ సినిమా తెలుగు వర్షన్ సెన్సార్ ఇప్పటికే పూర్తికాగా తాజాగా మంగళవారం తమిళ, హిందీ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన 'కింగ్ డమ్' (Kingdom) మూవీ ఈ నెల 31న మూడు భాషల్లో విడుదల కాబోతోంది. తెలుగు వర్షన్ సెన్సార్ ఇప్పటికే పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ ను పొందింది. మూవీకి సెన్సార్ నుండి మంచి రిపోర్ట్ వచ్చింది. మంగళవారం మిగిలిన రెండు భాషలు (హిందీ అండ్ తమిళ వర్షన్స్) సెన్సార్ కూడా పూర్తయినట్టు తెలిసింది. దీంతో 'కింగ్ డమ్' మూడు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రంగం సిద్థమైపోయింది. ఇదిలా ఉంటే... ఇప్పటికే బుక్ మై షోలో ఈ సినిమా టిక్కెట్లు లక్ష అమ్ముడయినట్టుగా మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను ఆంధ్ర, తెలంగాణలో ప్రీమియర్ష్ షో వేయడం లేదని సమాచారం. దాంతో 31వ తేదీకే బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాదు... ఈ ఊపు విదేశాల్లో కూడా ఉంది. యు.ఎస్.ఎ.లో అయితే 30వ తేదీనే ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. ఇప్పటికే అక్కడ 20 వేల టిక్కెట్స్ అమ్ముడుపోయినట్టు మేకర్స్ తెలిపారు.
విజయ్ దేవరకొండ నటించిన సినిమాలేవీ ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ అంచనాలతో వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' సైతం ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. అయినా విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి, సూర్యదేవర నాగవంశీ కాంబోలో రూపుదిద్దుకున్న 'కింగ్ డమ్'కు ఊహించని క్రేజే వచ్చింది. ఆ స్థాయిలోనే ప్రీ రిలీజ్ టిక్కెట్ సేల్స్ కూడా ఉన్నాయి. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషించాడు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించాడు. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా... బాక్సాఫీస్ బరిలో ఇది సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయం.
Also Read: The Rajasaab: పూరితో డార్లింగ్ ముచ్చట్లు
Also Read: Wednesday Tv Movies: బుధవారం, జూలై 30.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు