Thota Tharani: తోట తరణికి.. అరుదైన ఘనత! ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
ABN, Publish Date - Nov 13 , 2025 | 09:45 AM
ప్రముఖ కళా దర్శకుడు తోటతరణి (Tota Tharani) అరుదైన ఘనత సాధించారు. ఫ్రాన్స్ ప్రభుత్వపు అత్యున్నత పురస్కారమైన ‘చెవాలియర్’(Chevalier Award)కు ఎంపికయ్యారు.
కళా దర్శకుడు తోటతరణి (Thota Tharani) అరుదైన ఘనత సాధించారు. ఫ్రాన్స్ ప్రభుత్వపు అత్యున్నత పురస్కారమైన ‘చెవాలియర్’(Chevalier Award)కు ఎంపికయ్యారు. ఆయన ఈ పురస్కారం సాధించినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ‘ఘాటి’, ‘హరి హర వీరమల్లు’, ‘కుబేర’ చిత్రాలతో పాటు ‘అతడు’, ‘గీతాంజలి’, ‘పుష్పక విమానం’, ‘సాగర సంగమం’ వంటి సూపర్ హిట్స్‌కు ఆయన కళాదర్శకత్వం వహించారు.
ఉత్తమ కళాదర్శకత్వం విభాగంలో ‘నాయకుడు’, ‘భారతీయుడు’ చిత్రాలకు రెండు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే మూడు నంది పురస్కారాలు దక్కించుకున్నారు. 2001లో పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. చెన్నైలోని ఫ్రెంచ్ కాన్సులేట్‌లో ఈ పురస్కారాన్ని ఆయన నేడు అందుకోనున్నారు. దివంగత నటుడు శివాజీ గణేశన్, తారలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, షారుక్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ తదితరులు గతంలో ‘చెవాలియర్’ అవార్డును అందుకున్నారు.
పవన్.. శుభాకాంక్షలు
ప్రముఖ కళా దర్శకులు శ్రీ తోట తరణి గారికి ఫ్రాన్స్ ప్రభుత్వం చెవాలియర్ డె లా లీజియన్ డి హానర్ పురస్కారాన్ని ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంతోషం వ్యక్తం చూస్తే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. తోట తరణి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మన దేశ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ కళా దర్శకుల్లో శ్రీ తరణి గారు ముందు వరుసలో ఉంటారు. ఎటువంటి కథాంశానికైనా సహజత్వం ఉట్టిపడేలా సెట్స్ రూపొందిస్తారు. వర్తమాన సమాజానికి సంబంధించిన కథ కావచ్చు, చారిత్రక గాథ అయినా, భక్తి భావ చిత్రమైనా... ఏదైనా శ్రీ తరణి గారు అధ్యయనం చేసి చక్కటి డ్రాయింగ్స్ వేసి సెట్స్ తీర్చిదిద్దుతారు. హరిహర వీరమల్లు చిత్రానికి ఆయనే కళా దర్శకత్వం వహించారు. ఆయన నుంచి నవతరం స్ఫూర్తి పొందాలి. శ్రీ తరణి గారు సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను అన్నారు.