Kamal Haasan And Rajinikanth: కమల్‌తో తలైవా ఓకే.. దర్శకుడే కొలిక్కి రాలేదు..
ABN, Publish Date - Sep 18 , 2025 | 10:57 AM
కోలీవుడ్ అగ్ర కథానాయకులు కమల్‌హాసన్, రజనీకాంత్ కలిసి ఓ సినిమా చేస్తున్నారనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే!
కోలీవుడ్ అగ్ర కథానాయకులు కమల్‌హాసన్(Kamal Haasan) రజనీకాంత్ (Rajinikanth) కలిసి ఓ సినిమా చేస్తున్నారనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే! ఇటీవల జరిగిన సైమా వేడుకలో కమల్ ఈ విషయాన్ని అఫీషియల్‌గా చెప్పారు. దాంతో ప్రేక్షకులు, ఇరువురి అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. వీరిద్దరు కలిసి 46 ఏళ్ల తర్వాత నటించనున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళ్తుందా అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అయితే దర్శకుడు ఎవరనేది ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. రజనీ, కమల్‌తో సినిమాలు తీసి హిట్ అందుకున్న లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని టాక్ నడిచింది. తాజాగా మరో పేరు వినిపిస్తోంది. తాజాగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో అలరించిన ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ ఇద్దరిలో ఎవరికి ఈ అవకాశం దక్కుతుందనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ చిత్రం గురించి రజనీకాంత్ కూడా తొలిసారి స్పందించారు. కమల్‌హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థతోపాటు, ఉదయనిధి స్ట్టాలిన్ సంస్థ రెడ్ జెయింట్ మూవీస్ కలిసి నిర్మిస్తున్న సినిమాకి సంతకం చేశానని తలైవా తెలిపారు. అయితే కథ, దర్శకుడు ఇంకా ఖరారు కాలేదని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కమల్‌హాసన్‌తో కలిసి మళ్లీ సినిమా చేయాలని నాకూ ఎప్పటి నుంచో ఉంది. అయితే అదంతా కథ, దర్శకులపైనే ఆధారపడి ఉంటుంది’ అన్నారు. దీనిని బట్టి చూస్తే ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం లేదని తెలుస్తోంది.