Vaadivaasal: ఆగిపోయిన సూర్య వాడివాసల్.. ?
ABN, Publish Date - Jun 06 , 2025 | 05:16 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) గతేడాది కంగువ(Kanguva) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో అంచనాల మధ్య రిలీజై భారీ పరాజయాన్ని అందుకుంది.
Vaadivaasal: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) గతేడాది కంగువ(Kanguva) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో అంచనాల మధ్య రిలీజై భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత సూర్య రెట్రో(Retro) సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 10 న రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. తమిళ్ లో సూర్య ఫ్యాన్స్ కు నచ్చినా తెలుగువారు మాత్రం రెట్రోను అంతగా ఆదరించలేదు.
ఇక ఇప్పుడు సూర్య సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సూర్య చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి వాడివాసల్(Vaadivaasal) . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్(Vetrimaaran) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సూర్య ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. వాడివాసల్ రిలీజ్ కాకుండానే ఆగిపోయిందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా సూర్య ఈ సినిమాను ప్రకటించాడు.
మూడేళ్ళుగా వెట్రిమారన్ ఈ సినిమా కోసం సూర్యను వెయిట్ చేయిస్తూనే ఉన్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు వెట్రిమారన్ బౌండరీ స్క్ట్రిప్ట్ తో రాలేదని, ఇక ఓపిక నశించి సూర్య వాడివాసల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య తండ్రీకొడుకుల్లా డబుల్ రోల్ లో కనిపించనున్నాడు. జల్లికట్టు నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా మేకర్స్ చెప్పినదాని ప్రకారం ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి వెళ్ళాలి. వచ్చే ఏడాది సంక్రాంతికి వాడివాసల్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
ఏడాది సగం అయ్యిపోయింది. ఇప్పటివరకు ఈ చిత్రం సెట్స్ మీదకు కూడా వెళ్లలేదు. దీంతో సూర్య.. సినిమా నుంచి తప్పుకోక తప్పలేదని సమాచారం. ఇక సూర్య తప్పుకుంటే ఈ కథ ఏ హీరో వద్దకు వెళ్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం సూర్య , తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ సినిమాతో సూర్య విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.