సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

S.L. Bhyrappa: చిత్రసీమలోనూ తనదైన ముద్ర వేసిన ఎస్. ఎల్. భైరప్ప

ABN, Publish Date - Sep 26 , 2025 | 01:11 PM

ప్రముఖ కన్నడ రచయిత ఎస్.ఎల్. భైరప్ప (S.L. Bhyrappa) (శాంతశివర లింగనయ్య భైరప్ప) 94 యేళ్ళ వయసులో అనారోగ్యంతో సెప్టెంబర్ 24న తుది శ్వాస విడిచారు. శుక్రవారం మైసూరులో ఆయన అంత్యక్రియలు జరిగాయి,

ప్రముఖ కన్నడ రచయిత ఎస్.ఎల్. భైరప్ప (S.L. Bhyrappa) (శాంతశివర లింగనయ్య భైరప్ప) 94 యేళ్ళ వయసులో అనారోగ్యంతో సెప్టెంబర్ 24న తుది శ్వాస విడిచారు. శుక్రవారం మైసూరులో ఆయన అంత్యక్రియలు జరిగాయి. భైరప్ప తన స్వగ్రామంలో అంత్యక్రియలు జరపమని విల్లు రాసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆయన చివరి కోరికను కాదని మైసూరులో అంత్యక్రియలు జరపడాన్ని కొందరు ఆక్షేపించారు. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితుల కోరిక మేరకు మైసూరులోనే ఈ అంతిమ కార్యక్రమాన్ని జరిపారు. 1931 ఆగస్ట్ 20న హాసన్ జిల్లా లోని శాంతశివరాలో భైరప్ప జన్మించారు. విద్యావేత్తగా, నవలా రచయితగా ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2023లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ తోనూ, 2016లో పద్మశ్రీ అవార్డుతోనూ సత్కరించింది. 2010లో ఆయన సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని అందుకున్నారు.

సినిమాలుగా భైరప్ప నవలలు

1958లో 'భీమకాయ' రచనతో తన సాహితీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఎస్.ఎల్. భైరప్ప. ఐదు దశాబ్దాల కాలంలో ఇరవై నాలుగు నవలలు రాశారు. 1966లొ ఆయన రాసిన 'వంశవృక్ష' (Vamsa Vriksha) నవల 1970లో అదే పేరుతో కన్నడలో సినిమాగా రూపుదిద్దుకుంది. దీనిని బి.వి. కారంత్, గిరీష్‌ కర్నాడ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ద్వారానే విష్ణువర్థన్ (Vishnuvardhan), ఉమా శివకుమారి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 'వంశవృక్ష' సినిమానే తెలుగులో 'వంశవృక్షం' (Vamsa Vriksham) పేరుతో బాపు (Bapu) రీమేక్ చేశారు. తెలుగులో ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకట రమణ సంభాషణలు రాశారు. ఈ సినిమాతోనే అనిల్ కపూర్ (Anil Kapoor) తెలుగు వారి ముందుకు హీరోగా ముందుకొచ్చాడు. జేవీ సోమయాజులు, జ్యోతి, కాంతారావు, ముక్కామల తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. 'వంశవృక్షం' నవల 1986లో హిందీలో 'ప్యార్ కా సిందూర్' పేరుతో డబ్ అయ్యింది.

ఎస్. ఎల్. భైరప్ప రాసిన మరో నవల 'తబ్బలియు నీనారె మగన్' అదే పేరుతో 1977లో సినిమాగా వచ్చింది. దానిని కూడా బి.వి. కారంత్, గిరీష్‌ కర్నాడ్ సంయుక్తంగా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా 'గోధూళి' పేరుతో హిందీలోనూ ఒకేసారి షూటింగ్ జరుపుకుంది. రెండు భాషల్లోనూ తన పాత్రను నజీరుద్దీన్ షా పోషించగా, కన్నడ వర్షన్ లో మాను వేసిన పాత్రను హిందీలో కుల్ భూషణ్‌ కర్బందా, సుందర్ రాజా పోషించిన పాత్రను హిందీలో ఓంపురి చేశారు.

ఎస్.ఎల్. భైరప్ప రచించిన మరో నవల 'మతదాన' 2001లో అదే పేరుతో సినిమాగా తీశారు టి.ఎన్. సీతారామ్. ఈ పొలిటికల్ డ్రామాలో అనంత్ నాగ్ (Anantha Nag), తార, దేవరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఆయన రాసిన మరో నవల 'నాయి నెరళు' ను గిరీష్‌ కాసరవెల్లి అదే పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాలో పవిత్రా లోకేష్‌ (Pavitra Lokesh) ప్రధాన భూమిక పోషించారు. ఈ సినిమాలన్నీ కూడా ప్రభుత్వ అవార్డులను వివిధ కేటగిరిల్లో గెలుచుకున్నాయి.

ఎస్. ఎల్. భైరప్ప రాసిన నవలలు పలు భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యాయి. 'పర్వ' పేరుతో మహాభారత ఇతివృత్తాన్ని మానవ శాస్త్ర కోణంలో భైరప్ప రాశారు. దానికి విశేషమైన ఆదరణ లభించింది. అలానే ఆయన ఆ మధ్య రాసిన 'ఆవరణ' నవల సైతం తెలుగుతో పాటు పలు భాషల్లోకి అనువాదమై విశేష ఆదరణను పొందింది. కన్నడనాట పాపులర్ రైటర్స్ లో ఎస్. ఎల్. భైరప్ప కూడా ఒకరు. ఆయన మృతికి రాజకీయ, సాహితీ, సినిమా రంగానికి చెందిన పలువురు తీవ్ర సంతాపాన్ని తెలియచేశారు.

Updated Date - Sep 26 , 2025 | 01:21 PM