MARIA: ఆగస్టులో.. ప్రేక్షకుల ముందుకు లెస్బియన్ మూవీ
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:47 PM
కోలీవుడ్‌లో రూపొంది అవార్డులు గెలుచుకున్న ఓ లెస్బియన్ మూవీ థియేటర్లలో విడుదలకు రెడీ అయింది.
కోలీవుడ్‌లో మరో లెస్బియన్ మూవీ రూపొందింది. మరియా (MARIA) అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో పావల్ నవగీతన్ (Pavelnavageethan), సాయి శ్రీ ప్రభ ( Sai Shri Prabha), సింధు కుమరేశన్ (Sidhu Kumaresan), విఘ్నేష్ రవి (Vigneshravi) తదితరులు నటించారు. ఈ సినిమా నిర్మించి దర్శకత్వం వహించిన హరి కె. సుదన్ (Hari K Sudhan) ఈ సినిమా గురించి వివరిస్తూ, ‘ఒక స్త్రీకి సహజత్వానికి భిన్నంగా అసాధారణ అలోచనలు వస్తాయి. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో పాటు చుట్టూ ఉన్నవారికి చెప్పినపుడు వారు ఎలా స్వీకరించారు.? తద్వారా ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఇలాంటి అంశాలతో ఈ మూవీని తెరకెక్కించాం.
నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. హాలీవుడ్ దర్శకుడు స్టాన్లీ కుబ్రిక్ సినిమాల ప్రభావం నాపై చాలా ఎక్కువగా ఉంది. అదే నన్ను దర్శకత్వం వైపు ప్రోత్సహించేలా చేసింది. మలేసియా, లండన్, ఇటలీతో సహా కొన్ని దేశాల చిత్రోత్సవాల్లో ప్రదర్శించడం జరిగింది. ఇందులో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. సినిమాలోని పలు సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించి, ‘ఏ’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. ఆగస్టు నెలలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.