Bharathiraja: సినీ దర్శకుడు.. భారతిరాజాకు అస్వస్థత
ABN, Publish Date - Dec 29 , 2025 | 09:12 AM
ప్రముఖ సినీ దర్శకుడు భారతిరాజా తీవ్ర అస్వస్థతకు గురై నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రముఖ సినీ దర్శకుడు భారతిరాజా (Bharathiraja) తీవ్ర అస్వస్థతకు గురై నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 'పదినారు వయిదినిలే' చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమైన భారతీరాజా సిగ ప్పురోజాక్కళ్, కిళక్కేపోగుమ్ రైలు, టిక్ టిక్ టిక్ వంటి సూపర్ హిట్ మూవీలకు దర్శకత్వం వహించారు. గత కొన్నేళ్లుగా ఆయన దర్శకత్వం మానుకుని సినిమాలలో నటిస్తూ వచ్చారు. 'తిరుచిట్రమ్ బళం' సినిమాలో హీరో ధనుష్కు తాతగా నటించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్నారు.
అయితే.. గత మార్చిలో భారతి రాజా తనయుడు మనోజ్ భారతి రాజా క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. అప్పటి నుంచి భారతిరాజా తనయుడిని కోల్పోయిన దిగులుతో ఇంటిపట్టునే ఒంటరిగా గడుపుతూ వస్తున్నారు. కాగా మూడు రోజులకు ముందు ఆయనకు జ్వరం, ఒంటి నొప్పులు అధికమవడంతో ఆయనను చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.