Janhvi Kapoor: ఆగస్ట్ లో వస్తామంటున్న పరమ్ సుందరి...
ABN , Publish Date - Jul 12 , 2025 | 08:04 PM
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్ర జంటగా నటిస్తున్న సినిమా పరమ్ సుందరి. జూలై 25న రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఆగస్ట్ కు వాయిదా పడింది.
ప్రముఖ నటి, స్వర్గీయ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా 'పరమ్ సుందరి' (Param Sundari). ఈ సినిమాను జూలై 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇంతవరకూ చెబుతూ వచ్చారు. దాంతో అజయ్ దేవ్ గన్ 'సన్ ఆఫ్ సర్దార్ -2'తో 'పరమ్ సుందరి' పోటీ పడుతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావించాయి. అయితే ఇప్పుడా పోటీ తప్పిపోయింది. 'పరమ్ సుందరి' మూవీని ఆగస్ట్ కు వాయిదా వేసేశారు. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పకపోయినా మేకర్స్ ఓ టీజర్ ద్వారా తెలిపారు.
జూలై 11న రాజ్ కుమార్ రావ్ (Rajkummar Rao), మానుషి చిల్లర్ (Manushi Chhillar) నటించిన 'మాలిక్' (Maalik) మూవీ విడుదలైంది. ఈ సినిమా థియేటర్లలో 'పరమ్ సుందరి' లేటెస్ట్ టీజర్ ను ప్రదర్శిస్తున్నారు. గతంలో వచ్చిన టీజర్ చివరిలో జూలై 25న విడుదల అని ఉండగా, ఇప్పుడు అది కాస్త ఆగస్ట్ లో విడుదలగా మారిపోయింది. దీంతో... జూలై నుండి 'పరమ్ సుందరి' రిలీజ్ ఆగస్ట్ కు మారిపోయినట్టు అయ్యింది. అయితే ఆగస్ట్14న 'వార్ 2' మూవీ ఉంది కాబట్టి ఆ వీక్ ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉండదు. సో... ఆగస్ట్ ద్వితీయార్థంలోనే 'పరమ్ సుందరి' రిలీజ్ కావచ్చునని అంటున్నారు.
తుషార్ జలోటా దర్శకత్వంలో 'పరమ్ సుందరి' మూవీని దినేశ్ విజయ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో 'వేర్ నార్త్స్ ఫైర్ మీట్స్ సౌత్స్ గ్రేస్' అనే కాప్షన్ చూడగానే ఇది ఉత్తరాది, దక్షిణాది మేలు కలయికగా సాగే ప్రేమకథా చిత్రం అని అందరికీ అర్థమైపోయింది. టీజర్ లోనూ కేరళ అందాలను చాలా చక్కగా చూపించడంతో మూవీ కలర్ ఫుల్ గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. మరి ఆగస్ట్ లో థియేటర్లలో సందడి చేసే ఈ సినిమా జాన్వీ అండ్ సిద్ధార్థ్ మల్హోత్రాకు ఏ స్థాయి విజయాన్ని కట్టబెడుతుందో చూడాలి.
Also Read: Allu Arjun: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పాత్రలో అల్లు అర్జున్..
Also Read: Anurag Kashyap: చెత్త కంటెంట్ చూపించి నెట్ ఫ్లిక్స్ డబ్బులు గుంజుతుంది