Narasimha Sequel: తలైవ టైటిల్‌ కూడా చెప్పేశారు..

ABN , Publish Date - Dec 09 , 2025 | 07:13 PM

రజనీకాంత్‌ (Rajanikanth) కథానాయకుడిగా 1999లో విడుదలైన ‘నరసింహ’ (Narasimha) చిత్రం ఆయన అందుకున్న బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ఒకటి. ఓ మైల్‌ స్టోన్‌  అని కూడా చెప్పొచ్చు.

రజనీకాంత్‌ (Rajanikanth) కథానాయకుడిగా 1999లో విడుదలైన ‘నరసింహ’ (Narasimha) చిత్రం ఆయన అందుకున్న బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ఒకటి. ఓ మైల్‌ స్టోన్‌  అని కూడా చెప్పొచ్చు. కె.ఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించినీ చిత్రంలో రజనీకాంత్‌ టైటిల్‌ పాత్ర పోషించగా ఆయనకు భార్యగా వసుంధర పాత్రలో  సౌందర్య నటించారు. రమ్యకృష్ణ నీలాంబరి గా నటించి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సినిమా విడుదలై 26 ఏళ్లు అవుతున్నా ఈ పాత్ర ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రానుంది. డిసెంబర్‌ 12న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ‘నరసింహ’ను రీరిలీజ్‌ చేయనున్నారు. ఈ రీరిలీజ్‌ ప్రచారంలో భాగంగా రజనీ ప్రత్యేక వీడియో షేర్‌ చేశారు. అందులో రజనీకాంత్‌ (Narasimha Sequel) సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు.

‘ఆడవాళ్లందరూ గేట్లు బద్దలు కొట్టి థియేటర్లలోకి వచ్చిన సినిమా ‘నరసింహ’. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ తీయనున్నాం. ఎన్నో సినిమాలు రెండు భాగాలుగా  వస్తున్నాయి. అలాంటప్పుడు ఇంత సూపర్‌ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ ఎందుకు రాకూడదు అనిపించింది. 2.0 (రోబో సీక్వెల్‌), జైలర్‌ 2 చేేసటప్పుడు ఈ ఆలోచన వచ్చింది. నరసింహ రెండో భాగాన్ని ‘నీలాంబరి’ అనే టైటిల్‌తో మీకు అందిస్తాం. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయి’ అని రజనీకాంత్‌ అన్నారు. నీలాంబరి పాత్ర కోసం ఐశ్వర్యారాయ్‌ను సంప్రదించినట్లు రజనీకాంత్‌ చెప్పారు. ‘నరసింహ కథను నేనే రాశాను. నా స్నేహితుల పేర్లతో నిర్మించాను. ఇందులో ఎంతో పవర్‌ఫుల్‌ పాత్ర నీలాంబరి కోసం ఐశ్వర్యారాయ్‌ను సంప్రదించాం. కానీ, ఆమె ఆసక్తి లేదన్నారు. ఆ తర్వాత శ్రీదేవి, మాధురీదీక్షిత్‌ పేర్లను కూడా పరిశీలించాం. అలా చాలామంది పేర్లు చర్చించుకున్న తర్వాత దర్శకుడు రమ్యకృష్ణ అయితే న్యాయం చేయగలరని చెప్పారు. దీంతో రమ్యను ఎంపిక చేశాం’ అని రజనీ అన్నారు. 

Updated Date - Dec 09 , 2025 | 07:13 PM