Coolie: మళ్ళీ రజనీ మూవీకి డిమాండ్...
ABN , Publish Date - May 21 , 2025 | 12:03 PM
రజనీకాంత్ 'జైలర్' మూవీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో తాజా చిత్రం 'కూలీ' తెలుగు హక్కులు అంబరాన్ని తాకుతున్నాయి. అయినా ముగ్గురు నలుగురు బయ్యర్లు ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నారట!
'జైలర్' (Jailer) మూవీతో సౌండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆ తర్వాత సహజంగానే ఆయన సినిమాలకు క్రేజ్ ఏర్పడింది. అలానే క్రేజీ కాంబినేషన్స్ కు రజనీకాంత్ తెరలేపారు. అలా రూపుదిద్దుకున్న చిత్రమే 'కూలీ' (Coolie). దీనికి ముందు రజనీకాంత్ మూవీ 'లాల్ సలామ్' (Lal Salaam) వచ్చినా అది ఆయన హీరోగా నటించిన సినిమా కాదు. కేవలం గెస్ట్ అప్పీయరెన్సే ఇచ్చారు. అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే... 'జైలర్' తర్వాత రజనీకాంత్ పూర్తి స్థాయిలో హీరోగా నటించిన 'కూలీ' మూవీకి మంచి క్రేజ్ వచ్చింది. గతంలో 'జైలర్' మూవీ విడుదలైనప్పుడే... చిరంజీవి 'భోళా శంకర్' (Bhola Sankar) వచ్చింది. కానీ జనాలు రజనీకాంత్ మూవీకే జై కొట్టారు. ఇప్పుడు కూడా 'కూలీ'తో హిందీ సినిమా 'వార్ -2' (War -2) పోటీ పడబోతోంది. 'వార్ -2' హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్ట్ 14న రాబోతోంది. దానితో పోటీగా రజనీకాంత్ 'కూలీ' ఆగస్ట్ 15న విడుదల కానుంది.
రజనీకాంత్ - లోకేశ్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న 'కూలీ'లో శ్రుతీహాసన్ (Shruthi Haasan), నాగార్జున (Nagarjuna), సత్యరాజ్ (Satyaraj) వంటి వారు కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ సంస్థ దీనిని భారీ స్థాయిలో నిర్మించింది. దీంతో తెలుగులో ఈ సినిమా రైట్స్ అంబరాన్ని తాకేలా కనిపిస్తున్నాయి. రజనీకాంత్ 'జైలర్' మూవీని అప్పట్లో ఏషియన్ ఫిలిమ్స్ వారు రూ. 12 కోట్లకు తీసుకున్నారు. దానికి ముందు వచ్చిన రజనీకాంత్ సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అప్పటికే అదే భారీ మొత్తం అనే భావన బయ్యర్స్ కు ఉండేది.
ఎప్పుడైతే 'జైలర్' తెలుగులోనూ ఘన విజయాన్ని సాధించిందో దాని ప్రభావం 'కూలీ' తెలుగు హక్కుల మీద పడింది. పైగా ఇందులో నాగార్జున కూడా కీలక పాత్ర పోషించడంతో ఈ సినిమా తెలుగు హక్కుల కోసం ఇప్పుడు ఏషియన్ సునీల్ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నట్టు సమాచారం. నాగార్జున సైతం ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్నారని, తమ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా దీనిని విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. అలానే 'దిల్' రాజు (Dil Raju) సైతం 'కూలీ' హక్కుల కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదిలా ఉంటే... ఇటీవల సినిమా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టిన సూర్యదేవర నాగవంశీ (Suryadevara Nagavamsi) సైతం 'కూలీ' హక్కుల్ని కోరుతున్నారట. ఆయనైతే ఏకంగా నలభై రెండు కోట్లు ఇవ్వడానికి సిద్థపడ్డారన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. 'జైలర్' సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ను దృష్టి పెట్టుకునే నాగవంశీ నలభై కోట్లకు పైగా ఇవ్వడానికి సిద్థపడ్డారని అంటున్నారు. ఇక లోకేశ్ కనకరాజ్ కంటూ తెలుగులో స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ - లోకేష్ కాంబినేషన్ తప్పకుండా వర్కౌట్ అవుతుందనేది వారందరి నమ్మకం. మరి ఈ సినిమా తెలుగు రైట్స్ ఎవరికి దక్కుతాయో చూడాలి.
Also Read: Poonamkaur: త్రివిక్రమ్‌ను వదిలిపెట్టను.. నా దగ్గర ఆధారాలున్నాయి!
Also Read: Teja Sajja: మళ్ళీ మొదలైన మిరాయి షూటింగ్...
Also Read: Mohan Lal: రాకెట్ వేగంతో దూసుకుపోతూ...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి