Mohan Lal: రాకెట్ వేగంతో దూసుకుపోతూ...

ABN , Publish Date - May 21 , 2025 | 10:44 AM

సీనియర్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కు నటనలోనే విశ్రాంతి లభిస్తుందనుకుంటూ!. తన తోటి స్టార్స్ ఎవరూ చేయనన్ని సినిమాలను మోహన్ లాల్ వరుసపెట్టి చేస్తేస్తున్నాడు.

నవతరం హీరోలకు సవాల్ విసురుతూ సీనియర్ స్టార్స్ సాగడం చూస్తూనే ఉన్నాం... వారిలోనూ మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరింత స్పీడు చూపిస్తున్నారని చెప్పొచ్చు... ఇంతకూ ఆయన వేగంలోని పవరేంటో మీకు తెలుసా!

మొదటి నుంచీ సినిమాల విషయంలో స్పీడ్ చూపిస్తున్నది సౌత్ మూవీ స్టార్స్ అనే చెప్పాలి. 1962లోనే వంద సినిమాల్లో నటించిన తొలి స్టార్ గా నటరత్న యన్టీఆర్ నిలిచారు... ఆ తరువాత ఏయన్నార్, తమిళ నటుడు శివాజీగణేశన్, కన్నడ హీరో రాజ్ కుమార్ వంద మైలు రాయి దాటారు. వీరితో పాటే నూరు సినిమాలు పూర్తి చేసుకున్న ఆ నాటి మళయాళ స్టార్ ప్రేమ్ నజీర్ ఆ పై పెంచిన స్పీడ్ అంతా ఇంతా కాదు - ఏకంగా 700 పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు... అంతేకాదు నటి షీలాతోనే కలసి 150కి పైగా సినిమాల్లో నటించి కూడా మరో గిన్నిస్ బుక్ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు ప్రేమ్ నజీర్. ఆయన తరువాత కేరళలో స్టార్ హీరోస్ గా మమ్ముట్టి, మోహన్ లాల్ రాణిస్తున్నారు. వారు సైతం ఈ నాటికీ స్పీడ్ ప్రదర్శిస్తూ ఉండడం విశేషం. మోహన్ లాల్ ఎనిమిది నెలల వ్యవధిలో నాలుగు సినిమాలు రిలీజ్ చేసే ప్లాన్ చేశారు. అదీ ప్రస్తుతం మాలీవుడ్ లో విశేషంగా చర్చించుకుంటున్నారు.


ఆరు నెలల్లో హ్యాట్రిక్ !?

ఈ యేడాది ఇప్పటికే "ఎంపురాన్, తుడరుమ్" రెండు చిత్రాలతోనూ విజయం సాధించారు మోహన్ లాల్. ఈ రెండు చిత్రాలు ఒక్కోటి రెండు వందల కోట్లు పోగేయడం విశేషం! మోహన్ లాల్ హీరోగా నటించిన 'హృదయ పూర్వం' ఆగస్టు 28న విడుదల కానుంది. దీనికంటే ముందు మోహన్ లాల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన తెలుగు సినిమా 'కన్నప్ప' జూన్ 27న జనం ముందుకు రానుంది. ఒకవేళ 'హృదయ పూర్వం' కూడా మంచి విజయం సాధిస్తే, ఒకే కేలండర్ ఇయర్ లో వరుసగా మూడు బంపర్ హిట్స్ చూసిన స్టార్ గా మోహన్ లాల్ రికార్డ్ సృష్టిస్తారు. ఈ మధ్య కాలంలో ఒకే యేడాది హ్యాట్రిక్స్ చూసిన స్టార్స్ ఎవరూ కనిపించడం లేదు మరి! అదీ ఆరు నెలల వ్యవధిలో హ్యాట్రిక్ సాధించడమంటే ఆషామాషీ విషయం కాదు.

ఇక మోహన్ లాల్ నటిస్తోన్న రాబోయే చిత్రాలను లెక్కవేస్తే ఎనిమిది నెలల వ్యవధిలో నాలుగేసి సినిమాలు రానున్నాయి. ముందుగా ఆగస్టులో 'హృదయపూర్వం' వస్తుంది... తరువాత ఇదే యేడాది మోహన్ లాల్ మరో మూవీ 'వృషభ' విడుదల కానుంది. ఆ తరువాత ఇంకా టైటిల్ నిర్ణయించని సినిమా, ఆ పై జీతూ జోసెఫ్ డైరెక్షన్ లో మోహన్ లాల్ నటిస్తోన్న 'రామ్' రిలీజ్ కానున్నాయి. ఇవన్నీ వచ్చే యేడాది మార్చిలోగానే వెలుగు చూడనున్నాయని సమాచారం. అంటే కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో మోహన్ లాల్ నాలుగు చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయన్న మాట! టాలీవుడ్ సీనియర్ స్టార్స్ సైతం ఇలాగే సాగితే వారిని చూసి యంగ్ హీరోస్ కూడా ఇన్ స్పైర్ అవుతారు... ప్రస్తుతం పర్సంటేజ్ మీద సినిమాలు రిలీజ్ చేయాలని కోరుతున్న ఎగ్జిబిటర్స్ కోరుకునేది కూడా ఇది. అలా అందరు స్టార్స్ ఎక్కువ సినిమాల్లో నటిస్తూ ఉంటే థియేటర్స్ కు సరైన ఫీడ్ లభిస్తుంది. అప్పుడు పర్సంటేజ్ సిస్టమ్, రెంటల్ సిస్టమ్ అన్న వివాదాలే లేకుండా ఎప్పటిలా తెలుగు చిత్రసీమ సైతం కళకళ లాడుతుంది. మరి దీనికి మన టాప్ స్టార్స్ ఏమంటారో!?

Also Read: Teja Sajja: మళ్ళీ మొదలైన మిరాయి షూటింగ్...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 21 , 2025 | 10:44 AM