Coolie: కూలీ.. కథ లీక్? ఎలా అయిందంటే
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:01 PM
లోకేష్ కనకరాజ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబోలో తెరకెక్కి మరో రెండు వారాల్లో థియేటర్లకు వస్తున్నచిత్రం ‘కూలీ’.
యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కాంబోలో తెరకెక్కి మరో రెండు వారాల్లో థియేటర్లకు వస్తున్నచిత్రం ‘కూలీ’ (Coolie). ఈ చిత్ర కథ ఏమై ఉంటుందన్నదానిపై కోలీవుడ్‌లో గత కొన్ని నెలలుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇపుడు ఆ చిత్ర కథాంశం లీకైంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో రిలీజ్‌కు రెండు వారాల ముందు విదేశీ సెన్సార్‌షిప్ కోసం తాజాగా దరఖాస్తు చేసింది. అందులోని సమాచారం మేరకు.. ‘కార్మిక సంఘాలు, రహస్యంగా సాగే అక్రమ రవాణా ముఠాల నేపథ్యం, రోజు వారీ కూలీలను అత్యంత కిరాతకంగా వేధించే ముఠాకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యవంతుడైన కార్మికుడి పోరాటమే ఈ సినిమా మూల కథాంశం.
శక్తి, దృఢ సంకల్పంతో తనదైనశైలిలో పోరాటం చేయడంతో పాటు కార్మిక వర్గం గౌరవాన్ని కాపాడే సాటి కార్మికుడిగా రజనీకాంత్ పాత్ర కొనసాగుతుంది. ఇందులో పాతకాలపు రజనీ స్టైల్, లోకేష్ కనకరాజ్ శక్తివంతమైన కథనం, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఫుల్ యాక్షన్ మాస్ మూవీగా రూపొందించారు.
కాగా, ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున (Nagarjuna), ఉపేంద్ర (Upendra), అమీర్ ఖాన్ (Aamir Khan), సత్యరాజ్, శృతిహాసన్ (Shruti Haasan), షౌబ ఇన్ షాహిర్ (soubin shahir) వంటి పలువురు అగ్ర నటీనటులు నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.