Jailer 2: రజనీకాంత్ జైలర్ 2.. రిలీజ్ డేట్ ఫిక్స్
ABN, Publish Date - Sep 25 , 2025 | 11:34 AM
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. కేరళలో భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి కాగా రమ్యకృష్ణ, ఎస్‌జే సూర్య, మోహన్‌లాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ (2023) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, రజనీ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. ఆ విజయానికి కొనసాగింపుగా రూపొందుతోన్న జైలర్ 2పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమా బృందం కేరళలో నెల రోజుల పాటు షూటింగ్ నిర్వహించింది. పాలక్కాడ్‌లో భారీ పోరాట ఘట్టాలు, క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. వందలాది ఫైటర్స్ పాల్గొన్న ఈ యాక్షన్ ఎపిసోడ్ భారీ స్థాయిలో తెరకెక్కిందని సమాచారం. కాగా షెడ్యూల్ ముగిసిన వెంటనే రజనీకాంత్ చెన్నైకి తిరిగి వచ్చారు. తిరిగి సినిమా చివరి షెడ్యూల్ డిసెంబర్‌లో గోవాలో ప్రారంభించి జనవరి ఫస్ట్ వీక్ లోగా సినిమా పూర్తి చేయనున్నారు.
కాగా.. ఈ సినిమాలో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనుండగా యోగిబాబు, ఎస్‌జే సూర్య కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి గెస్ట్ రోల్స్‌లో కనువిందు చేయనున్నారు. ఈ కాంబినేషన్ తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
మొదటి భాగంలో మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ రవిచందర్ మరోసారి ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మళ్లీ సినిమాకు బలాన్ని చేకూర్చనుందని అభిమానులు నమ్ముతున్నారు. ప్రొడక్షన్ విలువలు మరింత పెంచి, ఈసారి టెక్నికల్‌గా ఇంకా గ్రాండ్‌గా జైలర్2ను సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోందని సమాచారం.
ఇదిలాఉంటే.. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. వచ్చే ఏడాది జూన్ 12, 2026న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. రజనీ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.