Parasakthi: అధికారికం.. సంక్రాంతి బరిలో ఇంకో సినిమా
ABN, Publish Date - Sep 12 , 2025 | 07:59 PM
ప్రతి సంక్రాంతి (Pongal) కి మహా అయితే రెండు మూడు సినిమాలు పోటీకి వచ్చేవి.. కానీ వచ్చే ఏడాది సంక్రాంతి మాత్రం అరడజను సినిమాలు కంటే ఎక్కువే పోటీకి వస్తున్నాయి.
Parasakthi: ప్రతి సంక్రాంతి (Pongal) కి మహా అయితే రెండు మూడు సినిమాలు పోటీకి వచ్చేవి.. కానీ వచ్చే ఏడాది సంక్రాంతి మాత్రం అరడజను సినిమాలు కంటే ఎక్కువే పోటీకి వస్తున్నాయి. పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలు.. డబ్బింగ్ సినిమాలు.. ఇలా మొత్తం కలిపి ఈసారి పండగ అదిరిపోనుంది. ఇప్పటికే ఎప్పటినుంచో సంక్రాంతి కోసమే అని కాచుకు కూర్చున్న సినిమాలు మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రోజు, ది రాజాసాబ్, జన నాయగన్ సినిమాలు ఉన్నాయి.
ఇవి కాకుండా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ కూడా సంక్రాంతి బరిలోకి దిగుతుంది అని వార్తలు వస్తున్నాయి. ఇంకొన్ని రోజుల్లో అది కూడా అధికారికంగా మేకర్స్. ఒకదాని తరువాత ఒకటి ఇలా సంక్రాంతి బరిలోకి దిగుతుంటే.. థియేటర్ల కోసం పెద్ద యుద్ధాలే జరగనున్నాయని తెలుస్తోంది. అయితే ఇక్కడితో ఆగకుండా ఇంకో డబ్బింగ్ సినిమా సంక్రాంతి బరిలో నేను కూడా అంటూ వచ్చి చేరింది. అదే పరాశక్తి.
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా ఆకాశం నీ హద్దురా సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పరాశక్తి. ఈ సినిమాలో కోలీవుడ్ హీరోస్ అధర్వ, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై హైప్ ను క్రియేట్ చేసింది.
ప్రస్తుతం పరాశక్తి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న పరాశక్తి రిలీజ్ కానుందని తెలుపుతూ ఒక చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఉన్న సినిమాలు చాల్లేదని, ఈ సినిమా కూడా తోడవ్వడంతో.. నెటిజన్స్ ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తార్రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రిలీజ్ డేట్ లు అయితే అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఆ డేట్ కు రిలీజ్ అయ్యేవరకు నమ్మకం లేదని కొందరు అంటున్నారు. మరి సంక్రాంతి 2026 కి ఏయే సినిమాలు పోటీ పడతాయో.. ఏయే సినిమాలు వెనక్కి తగ్గుతాయో చూడాలి.