Mohan Lal: అందరికన్నా.. 'చిన్న దాదా' మోహన్ లాల్
ABN, Publish Date - Sep 23 , 2025 | 08:26 PM
మన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమ పురస్కారం అంటే 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award) అన్నది అందరికీ తెలిసిందే.
మన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమ పురస్కారం అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award) అన్నది అందరికీ తెలిసిందే. 1969లో ఆరంభమైన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రతియేటా ఓ చిత్ర ప్రముఖునికి ప్రదానం చేస్తూ వస్తున్నారు. 2023 యేడాదికి గాను మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు' అందుకొన్నారు. ఫాల్కే అవార్డు అందుకున్నవారిలో మోహన్ లాల్ అతి పిన్న వయస్కుడుగా నిలవడం విశేషం. 1960 మే 21న జన్మించిన మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 65 ఏళ్ళు.
మోహన్ లాల్ ఇంకా స్టార్ డమ్ చవిచూడని రోజునే స్టార్ గా సాగుతూ, మళయాళ చిత్రసీమకు ఎన్నో సేవలు అందించిన మమ్ముట్టి (Mammootty) కి కాదని మోహన్ లాల్ కు 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డును ప్రకటించడం పట్ల కేరళలోనే భిన్నస్వరాలు వినిపించాయి. పైగా మోహన్ లాల్ కంటే జాతీయ స్థాయిలో ఎక్కువ సార్లు ఉత్తమ నటునిగా నిలచిన ఘనత మమ్ముట్టి సొంతం. అలాంటిది మమ్ముట్టికి అన్యాయం చేసి, మోహన్ లాల్ కు ఈ అవార్డును ప్రదానం చేశారని అన్నారు. అయితే అలాంటి వారి అభిప్రాయాలకు మమ్ముట్టినే చెక్ పెట్టారు. మోహన్ లాల్ కు లభించిన 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు' అతనికి మాత్రమే కాదని, అది మళయాళ చిత్ర సీమ మొత్తానికి దక్కిందని అన్నారు మమ్ముట్టి.
మోహన్ లాల్ కు రాజకీయ కోణంలోనే 'దాదాసాహెబ్ ఫాల్కే' దక్కిందనీ కొందరు అంటున్నారు. రాబోయే రోజుల్లో మోహన్ లాల్ తో ఓ సొంత పార్టీ పెట్టించి అక్కడ ఉన్న కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలను బలహీనం చేయాలన్నదే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆలోచననీ కేరళ రాజకీయ పండితుల అభిప్రాయం. ఈ మాటలు మామూలే అని మోహన్ లాల్ అభిమానులు అంటున్నారు. నిజానికి మోహన్ లాల్ ప్రతిభకే 'దాదాసాహెబ్ ఫాల్కే' ఆయనకు లభించిందని వారు వాదిస్తున్నారు.
మోహన్ లాల్ 40 సంవత్సరాలుగా చిత్రసీమలో కొనసాగుతున్నారు. నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు, పంపిణీదారుడుగా మోహన్ లాల్ మళయాళ సినిమారంగానికి సేవలు అందించారు. అంతేకాదు ఇప్పటికే మోహన్ లాల్ ఐదుసార్లు నేషనల్ ఫిలిమ్ అవార్డ్స్ అందుకున్నారు. అందులో 'భారతం' (1991), 'వానప్రస్థం' (1999) చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు. 'వానప్రస్థం' చిత్రానికి నిర్మాతగానూ నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. 1989లో 'కిరీడం', 2016లో 'జనతా గ్యారేజ్' (తెలుగు), పులిమురుగన్, ముంతిరివళ్ళికల్ తలిర్కుంబోల్' చిత్రాలతోనూ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ దక్కించుకున్నారు. ఇక 2001లో 'పద్మశ్రీ', 2019లో 'పద్మభూషణ్' అవార్డులు సైతం అందుకున్నారు మోహన్ లాల్. ఇలా చూస్తే జాతీయ స్థాయిలో మోహన్ లాల్ కే ఎక్కువ అవార్డులు ఉన్న మాట వాస్తవమేనని మమ్ముట్టి ఫ్యాన్స్ సైతం అంగీకరిస్తారు. అలా ఎలా చూసినా మోహన్ లాల్ 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'కు అన్ని విధాలా అర్హుడే అంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయాలను రెచ్చగొట్టాలనేవారే సంకుచితంగా ఆలోచిస్తున్నారనీ చెబుతున్నారు.
ఏది ఏమైనా 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు గ్రహీతల్లో అత్యంత పిన్నవయస్కుడుగా మోహన్ లాల్ నిలిచారు. సెప్టెంబర్ 23 మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా మోహన్ లాల్ 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు' అందుకుంటున్న సమయంలోనూ అక్కడ హాజరయిన అందరూ నిలచి మరీ ఆయనకు గౌరవసూచకంగా కరతాళధ్వనులతో అభినందించడం విశేషం! ద్రౌపదీ ముర్ము సైతం తన ప్రసంగంలో మోహన్ లాల్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 'ఈ అవార్డు తాను కన్న కల కాదని, అంతకు మించిన వరమని, దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తానని' మోహన్ లాల్ చెప్పారు. మోహన్ లాల్ ను అభిమానించే తెలుగువారు కూడా ఆయనకు 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు' అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.