CBFC: నిన్న కన్నప్ప... నేడు జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:59 PM
సురేశ్ గోపీ కీలక పాత్ర పోషించిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై మలయాళ చిత్రసీమ నిరసన వ్యక్తం చేసింది. కేరళలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు సి.బి.ఎఫ్.సి. ఆఫీస్ ముందు ధర్నా చేశారు.
కేంద్ర మంత్రి సురేశ్ గోపీ నటించిన 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' చిత్రానికి, సెన్సార్ బోర్డ్ కు మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. కొన్ని నిజ సంఘటనల ఆధారంగా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాను తీసినట్టు ఆ చిత్ర దర్శకుడు ప్రవీణ్ నారాయణ్ తెలిపారు. ఈ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మూవీలో జానకి పాత్రను అనుపమా పరమేశ్వరన్ పోషించారు. 'నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది' అనేది ట్యాగ్ లైన్. ఇందులో నాయిక పేరును జానకిగా పెట్టడంపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసిందట. సీతాదేవిని జానకి అని కూడా సంబోధిస్తారని, దాడికి గురైన ఓ మహిళకు ఆ పేరు ఎలా పెడతారని సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించిందట. కానీ సెన్సార్ వాళ్ళు చెప్పిన వాటికి అంగీకరిస్తే... సినిమాలో చాలా సన్నివేశాలలో డైలాగ్స్ మార్చాల్సి వస్తుందని, అది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా సమయాన్ని కూడా హరించేదని మేకర్స్ వాపోతున్నారు.
అసలు అభ్యంతరం సెంట్రల్ ఆఫీస్ నుండి!
ఏ భాషా చిత్రాలను ఆయా ప్రాంతాలలో సెన్సార్ చేయడమనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే చాలా సందర్భాలలో స్థానిక చిత్రాలను అక్కడి ఆచార వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని సెన్సార్ సభ్యులు సెన్సార్ చేస్తుంటారు. ఆ రకంగా కొన్ని సినిమాలలోని సంభాషణలను, సన్నివేశాలను ఉదారంగా చూసి, చూడనట్టు వదిలివేయడం జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ అనేది ఒకటి మొదలైంది. ప్రాంతీయ చిత్రాలను నాలుగైదు భాషల్లో డబ్ చేసి ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఇదే ఇప్పుడు పలు చిత్రాలను ఇబ్బందులకు గురిచేస్తోందని తెలుస్తోంది. దక్షిణాది ఆచార వ్యవహారాలకు ఉత్తరాది వాటికి కొంత తేడా ఉంటుంది. అలానే ఇక్కడ దేవీ దేవతల ఆరాధనకు ఉత్తరాది వారి ఆరాధన విధానానికి వ్యత్యాసం ఉంటుంది. దాంతో ఇక్కడ అభ్యంతరకరంగా అనిపించనిది... ఉత్తరాది వారికి అభ్యంతరకరం కావచ్చు. ఈ కారణంగానే గత కొంతకాలంగా సినిమాలను సెన్సార్ చేసే సమయంలో కేవలం ప్రాంతీయ భాషను, ఆచార వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా మొత్తం భారతీయ ఆచార వ్యవహారాలను దృష్టిలో పెట్టుకుని సెన్సార్ చేయమని కోరుతున్నారట.
'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' విషయంలో అదే జరిగిందని సమాచారం. జూన్ 27న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, 22న కేరళలోని సెన్సార్ ప్రాంతీయ కార్యాలయం అధికారులు దీన్ని చూసి యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారట. దాంతో మేకర్స్ హ్యాపీ ఫీలయ్యారు. కానీ 'జానకి' అనే పేరును దాడికి గురైన మహిళకు పెట్టడానికి కేరళ వారికి అభ్యంతరం ఉండకపోవచ్చు... బట్ ఉత్తరాది ప్రేక్షకుల మనోభావాలను ఇది దెబ్బ తీయవచ్చునని ముంబైలోని సెంట్రల్ సెన్సార్ బోర్డ్ సభ్యులు భావించారట. దాంతో ఆ మర్నాడే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ముందు టైటిల్ మార్చడంతో పాటు సినిమాలో జానకి పేరును తొలగించమని సూచన చేశారట. ఇలా ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే సెన్సార్ బృందం ఇలా యూటర్న్ తీసుకోవడంపై మేకర్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇందులో హీరోయిన్ పేరు జానకి కాగా ఆమె రిలేషన్ లో ఉండే వ్యక్తి పేరు అబ్రహం అని, వీరిద్దరికి సంబంధించిన సున్నితమైన అంశాలు కలిగిన కథ కావడంతో జానకి పేరును తొలగించాల్సిందేనని ముంబై అధికారులు పట్టుపడుతున్నారట. పర్యవసానంగా సోమవారం మలయాళ సినిమా రంగానికి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కేరళలోని సెన్సార్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
సరిగ్గా వారం క్రితం తెలుగు సినిమా 'కన్నప్ప' విషయంలోనూ అదే జరిగినట్టు తెలుస్తోంది. 'కన్నప్ప' సినిమాకు ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా... ఇది డివోషనల్ మూవీ కావడంతో ముంబై కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దాంతో 'కన్నప్ప'ను రివైజింగ్ కమిటీకి పంపి అక్కడ నుండి మేకర్స్ సర్టిఫికెట్ పొందారట. మొత్తం మీద పాన్ ఇండియా అనేది దర్శక నిర్మాతలను, సెన్సార్ అధికారులను కూడా ఇప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. మరి నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ ఈ సమస్యను పట్టించుకుని దీనికేమైనా పరిష్కారం ఆలోచిస్తారేమో చూడాలి.
Also Read: Ramayanam: రామాయణ్.. ప్రపంచానికి ఇచ్చే బహుమతి