KVN Productions: పెద్ద ఫ్లానే ఇది..హోంబలే, మైత్రిలకు పోటీగా మరో నిర్మాణ సంస్థ
ABN, Publish Date - Aug 06 , 2025 | 03:10 PM
హోంబలే, మైత్రి నిర్మాణ సంస్థల తరహాలోనే కొత్తగా ఓ సంస్థ సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
ఏడేండ్ల క్రితం కేజీఎఫ్ అనే సినిమాతో అనామకంగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తోన్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ (Hombale Films). కన్నడ నాట ఓ చిన్న చిత్రంతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడమే కాక క్రేజీ ప్రాజెక్టులతో విపరీతమైన అంచనాలతో దూసుకు పోతుంది. కేజీఎఫ్ తర్వాత కాంతార, సలార్ వంటి భారీ విజయాలు సొంతం చేసుకున్న ఈ సంస్థ తాజాగా మహావతార్ నరసింహా అనే యానిమేషన్ సినిమాతో అన్ని ఇండస్ట్రీలలో సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. అయితే.. ఇప్పుడు ఈ నిర్మాణ సంస్థ తరహాలోనే కొత్తగా కెవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అనే సంస్థ సైతం ఈ బాటను ఫాలో అవుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
2020లో కోనంకి వెంకట్ నారాయణ (Venkat K. Narayana), నిషా వెంకట్ (Nisha Venkat Konanki) స్టార్ట్ చేసిన ఈ కెవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ 2021 నుంచి సినిమాలు రూపొందిస్తూ ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ వస్తోంది. హోంబులే లానే కర్ణాటక (Karnataka) శాండల్‌వుడ్ నుంచి వచ్చిన ఈ సంస్థ, ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని భాషలలో భారీ సినిమాలపై దృష్టి పెట్టింది. మొదట్లో చిన్న చిత్రాలతో ప్రయోగాలు చేసిన కెవీఎన్, ఇప్పుడు స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ ప్రాజెక్టుల వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కన్నడలో సూపర్‌స్టార్ యష్ నటిస్తోన్న టాక్సిక్ (Toxic) సినిమాకు నిర్మాణ భాగస్వామిగా కొనసాగుతోండగా, ధృవ్ సర్జాతో చేసిన కేడీ (KD - The Devil ) త్వరలో రిలీజ్ కానుంది.
మరోవైపు తమిళ అగ్ర హీరోలైన విజయ్‌తో జన నాయగన్ (Jana Nayagan) సినిమాను నిర్మిస్తోన్నఈ సంస్థ, లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీతో ఖైదీ2 సనిమాను సైతం నిర్మిస్తోండడం విశేషం. అవేగాక ఇంకా నూ ప్రాజెక్టులపై చర్చలు జరుపుతూ కోలీవుడ్‌లో తమ ఎంట్రీని సుస్‌థిరం చేసుకునేందుకు సిద్ధమవుతుంది. కాగా ఇప్పటికే మరో స్టార్ అజిత్, సూర్యలతో సైతం సినిమాల కోసం చర్చలు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగానే తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, ఎన్టీఆర్, బాలకృష్ణ, రామ్ చరణ్ వంటి టాప్ హీరోలతో సినిమాల కోసం కెవీఎన్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో భాషలో ఒక్కో స్టార్‌తో భారీ ప్రాజెక్ట్స్ ప్రకటిస్తూ, పాన్ ఇండియా స్థాయిలో బ్రాండ్ విస్తరించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
గతంలో తెలుగు భారీ చిత్రాలు కల్కి, దేవర, RRR వంటి చిత్రాలను కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేసిన అనుభవం ఉన్న ఈ సంస్థ కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా.. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), హోంబలే ఫిల్మ్స్ తరహాలోనే మల్టీ లాంగ్వేజెస్‌లో సినిమాలు తీస్తూ సామ్రాజ్యాన్ని విస్తరించాలనే భారీ ఫ్లానింగ్‌లో ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే తమిళం, కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమలలో ప్రముఖ దర్శకులతో కెవీఎన్ ప్రొడక్షన్ హౌస్ టచ్‌లో ఉంది. పైగా అందుతున్న సమాచారం ప్రకారం ఇపాటికే టాలీవుడ్‌లో బాబీ కొల్లి (Bobby Kolli), చందూ మొండేటి లాంటి పెద్ద డైరెక్టర్లకు అడ్వాన్స్ సైతం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వీరి డైరెక్షన్‌లోనే చిరంజీవి, ఎన్టీఆర్ వంటి హీరోలతో సినిమాలు చేయాలని చూస్తున్నట్లు ట్రేడ్ వర్గాల టాక్.