Tollywood: నిజ సంఘటనల ఆధారంగా 'కాళీమాతా'
ABN , Publish Date - Nov 04 , 2025 | 02:15 PM
నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కొత్త సినిమా వివరాలను తెలిపారు. బహు భాషా చిత్రంగా 'కాళీమాతా' సినిమాను తీయబోతున్నానని, నిజ సంఘటనల ఆధారంగా స్త్రీ శక్తిని తెలియచేసే చిత్రమిదని ఆయన అన్నారు.
తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేవ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మరోసారి చిత్ర నిర్మాణానికి సంకల్పించారు. గతంతో ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన పలు చిత్రాల నిర్మాణ వ్యవహారాలను పర్యవేక్షించిన కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి సొంతగానూ కొన్ని సినిమాలను నిర్మించారు. ఇప్పుడు మరోసారి 'కాళీమాతా' పేరుతో సినిమాను నిర్మించబోతున్నట్టు ఆయన తెలిపారు. నిజ సంఘటనల ఆధారంగా బహుభాషా చిత్రంగా 'కాళీమాతా'ను రూపొందించ బోతున్నట్టు కేతిరెడ్డి ప్రకటించారు. 'ట్రూల్ హాజ్ నో పాస్ పోర్ట్' అనేది టైటిల్ ట్యాగ్ లైన్.
మతం, జాతి, భాష, ప్రాంతం అనే సరిహద్దులు దాటి 'సత్యానికి పాస్ పోర్ట్ ఉండద'నే విశ్వ సత్యాన్ని ప్రతిధ్వనింపచేసేలా ఈ సినిమా ఉంటుందని, నిజ సంఘటనల స్ఫూర్తితో దీనిని రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియాతో పాటు ఇతర అంతర్జాతీయ భాషల్లోనూ దీన్ని విడుదల చేస్తామని, దక్షిణ భారతదేశం నుండి అంతర్జాతీయ స్థాయికి చేరుకునే అరుదైన బహుభాషా చిత్రం ఇదని ఆయన అన్నారు. సమాజం, రాజకీయాలు, మనుషుల భావోద్వేగాల మేళవింపుగా ఈ సినిమా ఉంటుందని, ఇందులో సత్యం వర్సెస్ అధికారం; భక్తి వర్సెస్ దోపిడీ; న్యాయం వర్సెస్ అన్యాయం అనే అంశాలను సృజించబోతున్నట్టు తెలిపారు. ఇది కేవలం ఒక సినిమా కాదని, ఉద్యమమని, సత్యం యొక్క శక్తి, మహిళల ధైర్యం, న్యాయం కోసం అడ్డంకులను చెరిపేసే ఆత్మబలం ఇందులో ఉంటాయని అన్నారు. భారత్, నేపాల్ తో పాటు ఇతర దేశాల్లోనూ దీని చిత్రీకరణ జరుగుతుందని చెప్పారు. అతి త్వరలోనే ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియచేస్తామని అన్నారు.
Also Read: Phoenix: విజయ్ సేతుపతి కొడుకు కోసం మెగాఫోన్ పట్టిన అనల్ అరసు
Also Read: The Rajasaab: రాజాసాబ్ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత