Karthi: అప్పు చెల్లించాలంటూ కోర్టుకెళ్లిన ఫైనాన్సియర్.. కార్తీ సినిమా వాయిదా
ABN, Publish Date - Dec 05 , 2025 | 09:33 AM
కార్తి (Karthi) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వా వాదియార్’. నలన్ కుమార్‌స్వామి దర్శకత్వంలో కె.ఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కృతీశెట్టి కథానాయిక. ఇప్పుడీ సినిమా చిక్కుల్లో పడింది.
కార్తి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వా వాదియార్’. నలన్ కుమార్‌స్వామి దర్శకత్వంలో కె.ఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కృతీశెట్టి కథానాయిక. ఇప్పుడీ సినిమా చిక్కుల్లో పడింది. సినిమా రిలీజ్‌పై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌రాజాతో విభేదాలు తలెత్తడంతో ఫైనాన్షియర్ అర్జున్‌లాల్ సుందర్‌దాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు స్టే విధించింది. 2014లో దివాలా తీసినట్లు ప్రకటించిన అర్జున్ లాల్ వద్ద స్టూడియో గ్రీన్ సినిమా నిర్మాణ సంస్థ రూ.10.35 కోట్ల అప్పు తీసుకుంది. ఆ మొత్తం వడ్డీతో కలిపి ప్రస్తుతం రూ.21.78 కోట్లు అయింది. ఆ మొత్తాన్ని చెల్లించాలంటూ ఉత్తర్వులు ఇవ్వాలని, జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ‘వా వాదియార్’ విడులకు మధ్యంతర స్టే విధించాలని అర్జున్‌లాల్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎం. సుబ్రహ్మణ్యం, జస్టిస్ కుమరప్ప ధర్మాసనం మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో తెలుగులో విడుదల చేయనున్నారు. తొలుత ఈ నెల 5న విడుదలచేయనున్నట్లు గతంలో ప్రకటించిన చిత్ర బృందం.. డిసెంబరు 12న రిలీజ్ చేయనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు.