Rajinikanth: మంచితనం పెరిగిపోయిందా...

ABN , Publish Date - May 06 , 2025 | 04:11 PM

రజనీకాంత్ లోని మంచితనాన్ని కొందరు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. సూర్య నటించిన 'రెట్రో' మూవీని చూసి, రజనీకాంత్ కితాబిచ్చారంటూ ఆ చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ప్రచారం చేసుకోవడం రజనీ అభిమానులను ఇబ్బందుల్లో పడేసింది.

అందరితో మంచిగా ఉండాలనే గుణం ఒక్కోసారి మనిషి విలువను తగ్గించేస్తుంది. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పరిస్థితి అలానే ఉంది. ఇటీవల విడుదలైన 'రెట్రో' (Retro) మూవీని చూసి రజనీకాంత్ అద్భుతంగా తీశావంటూ కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraju) ను ఫోన్ లో అభినందించారట. ఈ విషయాన్ని కార్తీక్ సుబ్బరాజు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'ధ్యాంక్యూ తలైవా' అని పెట్టాడు. అయితే... మే 1న వచ్చిన 'రెట్రో' సినిమా డిజార్టర్ అనే విషయాన్ని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాతో పాటే నాని 'హిట్ -3' విడుదలైంది. నిజానికి 'హిట్-3' (Hit -3) కీ డివైడ్ టాక్ వచ్చింది. దారుణమైన హింస అందులో ఉందని జనాలు వాపోయారు. కానీ అదే రోజు వచ్చిన 'రెట్రో' చూసిన తర్వాత 'హిట్ -3' బెటర్ మూవీ అనడం మొదలెట్టారు. ఆ రకంగా తెలుగు రాష్ట్రాలలో 'రెట్రో'కు బాగా నెగెటివ్ టాక్ వచ్చింది.


తమిళనాట సూర్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో... ఓపెనింగ్స్ వరకూ బెటర్ గానే ఉన్నాయి. మొదటి రోజున ఈ సినిమా రూ. 17 కోట్లు వసూలు చేసిందట. అలానే ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి కలెక్షన్స్ రాలేదు. మొత్తం మీద వీకెండ్ పూర్తయ్యే సరికీ మూవీ రూ. 45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలిపారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్స్ కలెక్షన్స్ విషయంలో లేవు. ఇక ఈ సినిమాను తెలుగులో చూసిన వాళ్ళైతే... కార్తీక్ సుబ్బరాజు మతి ఉండి తీశాడా? లేకుండా తీశాడా? అని డైరెక్ట్ గా విమర్శిస్తున్నారు. 'పిజ్జా, జిగర్తాండ' వంటి సినిమాలు తీసిన దర్శకుడు చేసిన సినిమానేనా ఇది అని అడుగుతున్నారు. కార్తీక్ సుబ్బరాజు కు ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇక వృధానే అనే నిర్ణయానికి మరికొందరు వచ్చారు. అయితే ఇంత చెత్తగా ఉన్న సినిమాను రజనీకాంత్ ఎందుకు పొగిడి ఉంటాడనే సందేహం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కార్తీక్ సుబ్బరాజు 'పేట' (Peta) సినిమాను రజనీకాంత్ తో తీశాడు. అది కూడా ఏమంత విజయం సాధించలేదు. అయితే కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలనే తపనతో రజనీకాంత్ కార్తీక్ ను అభినందించి ఉండొచ్చని అనుకుంటున్నారు. అయితే... రజనీకాంత్ ఫోన్ కాల్ గురించి కార్తీక్ సోషల్ మీడియాలో రాసి అనవసరంగా పెద్దాయన పరువుతీశాడని కొందరు విమర్శిస్తున్నారు.

హీరో సూర్య నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. కానీ అతను తీసుకునే నిర్ణయాలు ఈ మధ్య కాలంలో ఫెయిల్ అవుతున్నాయి. కరోనా టైమ్ లో సూర్య చేసి 'ఆకాశం నీ హద్దురా, జై భీమ్' వంటి సినిమాలు వీక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆ సినిమా కథాంశాలు సైతం సామాన్యులను ఉత్తేజ పరిచేదిలా ఉంది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఆర్భాటంతో ఉన్నవి తప్పితే... ఆలోచింప చేసేలా లేవని, 'రెట్రో' సైతం అదే కోవకు చెందిన సినిమా అని అభిమానులు సైతం విమర్శిస్తున్నారు. మరి వీటిని సూర్య ఆలకిస్తాడో లేదో చూడాలి.

Also Read: Buchibabu: బుచ్చిబాబు తదుపరి చిత్రంపై క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 06 , 2025 | 04:12 PM