Rajinikanth: రజనీ @50.. ‘యవ్వనం ఎప్పటికీ విడిచిపెట్టదు.. వృద్ధాప్యం నాకు రాదు’
ABN, Publish Date - Aug 14 , 2025 | 11:44 AM
రజనీకాంత్ చిత్రపరిశ్రమలోకి ప్రవేశించి 50 యేళ్ళు పూర్తయిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) చిత్రపరిశ్రమలోకి ప్రవేశించి 50 యేళ్ళు పూర్తయిన సందర్భంగా చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా ఆగ్రనటుడు కమల్ హాసన్ తన ఎక్స్ ఖాతాలో ‘మన సూపర్‌స్టార్’ను నేనూ అభినందిస్తున్నాను’ అంటూ పోస్ట్ చేశారు. ‘సినిమాలో అర్థ శతాబ్దం అనేది అద్భుతమైనది. నా ప్రియ స్నేహితుడు రజనీకాంత్ సినిమాలో స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. మన సూపర్‌స్టార్‌ను నేను కూడా ప్రేమతో, అభిమానంతో అభినందిస్తున్నాను. ఈ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ‘కూలీ’ (Coolie) చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
అలాగే ‘కూలీ’ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj)ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ‘నా సినీ కెరీర్‌లో ‘కూలీ’ మూవీ ఎంతో ప్రత్యేకమైనది. రజనీకాంత్ చేరగానే ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమాభిమానాలను చూపించారు. ఈ సినిమా అద్భుతంగా రావడానికి ఇదొక కారణం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్నటికీ రుణపడి ఉంటాను. మీతో కలిసి పంచుకున్న అమూల్యమైన విషయాలను జీవితాతం గుర్తుండిపోతాయి. మమ్మల్ని అంతగా ప్రోత్సహించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ‘50 యేళ్ళు - ఒక సింహాసనం - ఒకే వ్యక్తి. తలైవర్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెలెబ్రేట్ చేసుకుందాం’ అంటూ చిత్ర సంగీత దర్శకుడు అనిరుథ్ పిలుపునిచ్చారు.
సినీ నటి, తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ మాట్లాడుతూ, ‘మీరు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారంటే అంకితభావం, నిబద్ధత, వృత్తినైపుణ్యం ఎంతో అవసరం. భారతీయ తెరపై ఇంతకుముందు, ఇక తర్వాత మీలాంటి స్టార్ ఎపుడూ లేరు. మీరు ప్రత్యేకమైన వ్యక్తి. మీ గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా.. 50వ వార్షిక శుభాకాంక్షలు’ అంటూ పేర్కొన్నారు. ‘50 యేళ్ళపాటు ఒకే రంగంలో అగ్రస్థానంలో ఉండటం అరుదైన విషయం. మీ కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతూనే ఉండాలని కోరుకుంటున్నానని ప్రముఖ గేయ రచయిత వైరముత్తు ట్వీట్ చేశారు. ‘ముత్తు’ చిత్రం కోసం రాసిన ‘యవ్వనం ఎప్పటికీ విడిచిపెట్టదు.. వృద్ధాప్యం నాకు రాదు’ అనే వాక్యంతో మిమ్మలను అభినందిస్తున్నాను అని పేర్కొన్నారు. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
తలైవర్ నటించిన టాప్ చిత్రాల్లో ‘కూలీ’ ఒకటి
ఇప్పటివరకు తలైవర్ రజనీకాంత్ నటించిన టాప్ చిత్రాల్లో ‘కూలీ’ ఒకటిగా నిలుస్తుందని సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి లత అన్నారు. ‘కూలీ’ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని విడుదలకు ముందే చూసిన ఆమె.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు ఉదయనిధి కూడా ఈ చిత్రాన్ని చూసి తన స్పందన తెలియజేశారు.
‘‘కూలీ’ చిత్రంలో ఎంటర్‌టైన్మెంట్ పూర్తి స్థాయిలో ఉంటుంది. రజనీకాంత్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 50 యేళ్ళు పూర్తయిన శుభసందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న అగ్ర నటుడు రజనీకాంత్. ఈ శుభతరుణంలో ఆయనను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రజనీ నటించిన ‘కూలీ’ గురువారం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముందుగానే చూసే భాగ్యం లభించింది. ఇందులో అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకు ఇది ఒక ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది’ అని ఉదయనిధి పేర్కొన్నారు.