Rajinikanth, Kamal Haasan: ఈనాటి ఈ బంధమేనాటిదో...
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:02 PM
రాజ్యసభ సభ్యునిగా ఎంపిక అయిన సందర్భంగా తన చిరకాల, ప్రాణ మిత్రుడు రజనీకాంత్ ను కమల్ హాసన్ కలిశారు. ఈ సందర్భంగా రజనీ... కమల్ ను అభినందించారు.
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అంటే అందరికీ అభిమానమే. పార్టీలకు అతీతంగా ఆయన్ని ప్రేమించే వారు, అభిమానించేవారు, ఆరాధించేవారు, అనుసరించేవారు ఉంటారు. తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కూడా అందుకు అతీతమేమీ కాదు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. ఆ అనుబంధంతోనే రాజ్యసభ సభ్యునిగా ఎంపిక అయిన సందర్భంగా తన చిరకాల, ప్రాణ మిత్రుడు రజనీకాంత్ ను కమల్ హాసన్ కలిశారు. ఈ సందర్భంగా రజనీ... కమల్ ను అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోలను కమల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
రజనీకాంత్, కమల్ హాసన్ అనుబంధానికి ప్రధాన కారణం వీరిద్దరి గురువు కె. బాలచందర్ (K. Bala Chander). ఆయన తెరకెక్కించిన 'అపూర్వ రాగంగళ్'తో రజనీకాంత్ నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఇదే సినిమా తెలుగులో 'తూర్పు-పడమర'గా రీమేక్ అయ్యింది. అలా ఆ సినిమాతో మొదలైన బంధం 1985లో 'గిరఫ్తార్' వరకూ సాగింది. ఈ మధ్య కాలంలో వీరిద్దరూ కలిసి దాదాపు ఇరవై సినిమాల్లో నటిచారు. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి 'అంతులేని కథ, ఎత్తుకు పై ఎత్తు, వయసు పిలిచింది, అందమైన అనుభవం, మూండ్రు ముడిచ్, అల్లావుద్దీన్ అద్భుతద్వీపం, పదనారు వయదినిలె, అవర్ గళ్' వంటివి. అయితే తమిళనాడులోని ఓ థియేటర్ లో ఇద్దరు కలిసి నటించిన సినిమా విడుదలైన సందర్భంలో ఫ్యాన్స్ మధ్య ఏర్పడిన గొడవ చినికి చినికి గాలివానగా మారి, ఆ థియేటర్ కు నష్టం వాటిల్లింది. అభిమానులకు సర్ది చెప్పేకంటే... ఇద్దరూ కలిసి ఇకపై కలిసి నటించడం మానుకంటే మంచిదనే నిర్ణయానికి రజనీ, కమల్ వచ్చారు. అప్పటి నుండి కలిసి సినిమాలు చేయకపోయినా... ఒక సినిమాను మరొకరు ప్రశంసించడం, ఒకరి చర్యలను మరొకరు సమర్థించడం వస్తూ ఉంది.
కమల్ హాసన్ కంటే ముందే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అందరూ అనుకున్నారు. రజనీకాంత్ సైతం ఒకటి రెండు సార్లు అలాంటి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టి... ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. కానీ మడపతిప్పే అలవాటు లేని కమల్ హాసన్ తమిళ ప్రజలకు, తన అభిమానులకు మాట ఇచ్చినట్టుగానే 'మక్కల్ నీది మయ్యం' అనే పార్టీ పెట్టేశారు. ప్రజల నుండి కమల్ హాసన్ పార్టీకి సానుకూల స్పందన రాకపోవడంతో ఆయన గత ఎన్నికల్లో డీఎంకేకు మద్దత్తు పలికారు. దానికి ప్రతిగా ఆ పార్టీ కమల్ హాసన్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. దీంతో తొలిసారి చట్టసభల్లోకి వెళ్ళబోతున్న కమల్ హాసన్... దానికంటే ముందు రజనీకాంత్ ను కలిసి, ఆయన శుభాశీస్సులను స్వీకరించారు. ఇద్దరు తమిళ సీనియర్ ఆర్టిస్టులు ఇలా కలుసుకోవడం ఇద్దరి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.
Also Read: Vijay Sethupathi: నిత్యామీనన్‌తో.. ఇలాంటి సినిమా ఊహించలేదు
Also Read: సడన్‌గా ఓటీటీకి.. బాక్సాఫీస్‌ను అల్లాడించిన హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచర్