Ravi Mohan: స్టార్ హీరో ఇల్లు వేలం.. అదే ఇంట్లో పిల్లలతో భార్య
ABN, Publish Date - Sep 25 , 2025 | 10:32 AM
కోలీవుడ్ స్టార్ జయం రవి (రవి మోహన్)కు భారీ రుణ బాకీలు, బ్యాంకు అధికారులు ఇల్లు, కారు జప్తు నోటీసులు అంటించడంతో సినీ వర్గాల్లో సంచలనం.
కోలీవుడ్ నటుడు రవి మోహన్ (Ravi Mohan) కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. తాజాగా ఆయన ఇంటికి, స్టూడియోకు బ్యాంకు అధికారులు జప్తు నోటీసులు అంటించడంతో సినీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది.
వివరాల ప్రకారం, చెన్నై ఈసీఆర్‌లో జయం రవి కొనుగోలు చేసిన బంగ్లా కోసం తీసుకున్న రుణానికి సంబంధించి గత 10 నెలలుగా ఈఎంఐలు చెల్లించకపోవడంతో రూ.7.64 కోట్ల బాకీ పడ్డ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ జప్తు చర్యలు ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో బ్యాంకు అధికారులు రవి మోహన్ ఇల్లు, స్టూడియో వద్ద నోటీసులు అతికించారు. అయితే తేనాంపేటలోని కెమియర్స్ రోడ్‌లో ఉన్న రవి మోహన్ స్టూడియోస్ వద్ద అతికించిన నోటీసును సిబ్బంది చించేయడంతో అక్కడ కాస్త గందరగోళం నెలకొంది.
ప్రస్తుతం ఆ బంగ్లాలో రవి భార్య ఆర్తి రవి (Aarti Ravi) తన పిల్లలతో ఉంటున్నారు. రవి–ఆర్తి విడాకుల కేసు కోర్టులో కొనసాగుతుండగా, ఈ పరిస్థితిలో ఇల్లు వేలం వేస్తే ఆమె పిల్లలతో ఎక్కడ ఉంటారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇదే అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రవిపై విమర్శలు చేస్తున్నారు. "తాళి కట్టిన భార్యకు సొంత ఇల్లు లేకుండా రోడ్డుపైకి తెచ్చేస్తున్నారా?" అంటూ కామెంట్లు చేస్తున్నారు.