Ilaiyaraaja: 'డ్యూడ్' బుక్క‌య్యారు.. ఇళయరాజా రెండు పాట‌లు వాడేసుకున్నారు

ABN , Publish Date - Oct 22 , 2025 | 06:11 PM

మాస్ట్రో ఇళయరాజా మరోసారి మైత్రీ మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'డ్యూడ్' చిత్రంలో తన అనుమతి తీసుకోకుండానే రెండు పాటలను వాడుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తన హక్కులకు భంగం కలిగించిన సోనీ సంస్థపై ఆయన కోర్టు కెక్కారు.

Ilayaraaja

మాస్ట్రో ఇళయరాజా మరోసారి కన్నెర్ర చేశారు. ఈ యేడాది ప్రారంభంలో వచ్చిన అజిత్ సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో తన అనుమతి లేకుండానే మూడు పాటలను ఉపయోగించినందుకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై ఆ మధ్య కోర్టు కెక్కారు ఇళయరాజా. ఆయన అనుమతిలేకుండా పాటలను వాడుకోవడం తప్పు అని చెబుతూ కోర్టు 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుండి తొలగించమని ఉత్తర్వులు ఇచ్చింది. చిత్రం ఏమంటే... ఇప్పుడు మరోసారి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఇళయరాజా ఆగ్రహానికి గురయ్యారు. వారు నిర్మించిన తాజా చిత్రం 'డ్యూడ్' మీద కూడా ఇళయరాజా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాలోనూ తన పాటలను వాడేసుకున్నారని, ఇది తన హక్కుల్ని కాలరాయడమేనని ఆయన అంటున్నారు.


'డ్యూడ్' ఆడియో హక్కులు పొందిన సోనీ సంస్థపై ఆయన ఇప్పుడు కోర్టు కెక్కారు. 'డ్యూడ్' సినిమాలో తను గతంలో కంపోజ్ చేసిన రెండు పాటల్లోని కొంత భాగాన్ని వాడేసుకున్నారని ఇళయరాజా చెబుతున్నారు. ఆయన సంగీతం అందించిన 'పుదనెల్లు పుదు నాట్టు' లోని 'కరుత్తు మచ్చా' పాటలోని కొంత భాగాన్ని వాడేసుకున్నారు. సోనీ సంస్థ తన నుండి అనుమతి తీసుకోకపోవడంతో మద్రాస్ హైకోర్ట్ తలుపు తట్టారాయన. ఈ కేసు హియరింగ్ నవంబర్ 19న ఉంది. మరి దీనిపై సోనీ సంస్థ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. గత కొంతకాలంగా ఇళయారాజా తన అనుమతి లేకుండా ఎవరు ఏ పాటను ఉపయోగించినా క్షమించడం లేదు. వారిపై లీగల్ గా పోరాటం చేస్తున్నారు. సదరు నిర్మాతతో పాటు ఆయన మ్యూజిక్ సంస్థలపైనా కేసులు పెడుతున్నారు. మరి ఇక మీదట అయినా ఇళయరాజా అనుమతి తీసుకునే పాటలను వాడుకుంటారేమో చూడాలి.

Also Read: Mass Jathara Song: ఈ పాటకు అర్ధం లేదు పర్ధం లేదు.. తలా తోక అస్సలు లేదు

Also Read: Aneesh: 'లవ్ ఓటీపీ' చెబుతానంటున్న అనీష్

Updated Date - Oct 22 , 2025 | 06:52 PM