Anirudh Ravichander: ఆగస్టు 23న.. అనిరుధ్ ‘హుకుం’! టికెట్లకు భారీ డిమాండ్
ABN, Publish Date - Jul 30 , 2025 | 11:14 AM
అనిరుధ్ రవిచందర్ సారథ్యంలో ‘హుకుం’ పేరుతో భారీ సంగీత విభావరి ఆగస్టు 23వ తేదీ జరుగనుంది.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సారథ్యంలో ‘హుకుం’ (HUKUM) పేరుతో భారీ సంగీత విభావరి ఆగస్టు 23వ తేదీ జరుగనుంది. నగర శివారు ప్రాంతమైన ఈస్ట్ కోస్ట్ రోడ్ (ఈసీఆర్), కూవత్తూరులో ఉన్న ‘మార్గ్ స్వర్ణభూమి’ అనే ప్రాంతంలో జరుగనుంది.
గతంలో ఈసీఆర్‌లో జరిగిన ఏఆర్ రెహ్మాన్ సంగీత కచ్చేరి గందరగోళంగా మారిన నేపథ్యంలో అనిరుధ్ తన సంగీత కచ్చేరికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. విశాలమైన స్థలంలో వేలాది మంది సంగీత అభిమానుల భద్రత, పార్కింగ్ ఇత్యాది సౌకర్యాలపై నిర్వాహకులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈ మ్యూజిక్ కచేరికి సంబంధించి టిక్కెట్ల విక్రయం ఆగస్టు 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతుందని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.
అయితే ఈ షోకు సంబంధించి టికెట్లకు తమిళనాడు నుంచే గాక ఇతర రాష్ట్రాల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. గతంలో రెండు మూడు దఫాలుగా నిర్వహించిన కన్సర్ట్‌లకు మాములుగా రూ.1200 నుంచి మొదలై రూ.13 వేల వరకు ధరలు ఉన్నాయి. కాగా ఇప్పుడు అనిరుధ్ షోలకు హై డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ రేట్లు రూ.1500 నుంచి మొదలై రూ. 20 వేల వరకు ఉండవచ్చని అనుకుంటున్నారు.