Ashika Raganath: ఆషికా మూవీ.. వచ్చేస్తోంది
ABN, Publish Date - Dec 25 , 2025 | 06:49 PM
దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ మూవీ 'గత వైభవం' జనవరి 1న విడుదల కాబోతోంది.
నవంబర్ 14న తెలుగులో విడుదల కావాల్సిన కన్నడ అనువాద చిత్రం 'గత వైభవం' చివరి నిమిషంలో వాయిదా పడింది. ఎస్.ఎస్. దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన ఈ సినిమాకు సునీ దర్శకత్వం వహించడంతో పాటు దీపక్ తిమ్మప్పతో కలిసి ఈ ప్రాజెక్ట్ కు సహ నిర్మాతగానూ వ్యవహరించారు. గత నెలలో హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున సైతం పాల్గొన్నారు.
అయితే అప్పుడు కేవలం కర్ణాటకలోనే ఈ సినిమా విడుదలైంది. అక్కడ ఈ చిత్రానికి చక్కని ఆదరణ లభించిందని, అందుకే ఇప్పుడు తెలుగులో జనవరి 1న దీనిని విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాను తెలుగు వారి ముందుకు 'హను-మాన్' ఫేమ్ కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తీసుకొస్తున్నారు. ఇది న్యూ ఇయర్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుందని వారు తెలిపారు.
శివకుమార్, ఉల్లాస్ హైదర్, రఘు మైసూర్ అందించిన ప్రొడక్షన్ డిజైన్‌తో పాటు, భారీ నిర్మాణ విలువలతో 'గత వైభవం' రూపుదిద్దుకుందని, విలియం జె. డేవిడ్ సినిమాటోగ్రఫీని అందించగా, జుడా శాండీ అందించిన సంగీతం కథలోని భావోద్వేగ, పౌరాణిక అంశాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిందని నిరంజన్ రెడ్డి చెప్పారు. అత్యాధునిక విఎఫ్ఎక్స్, సౌండ్ తో పాటు సాగే గొప్ప కథనంతో ఈ సినిమా అలరిస్తుందని, ప్రేమ, పురాణం, పునర్జన్మ, చారిత్రక నాటకం కలగలిసిన చిత్రమిదని ఆయన తెలిపారు.