Vada Chennai World: ధనుష్ పై నయా రూమర్స్...
ABN , Publish Date - Jun 30 , 2025 | 01:26 PM
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కు 'కుబేర' (Kubera) చిత్రం చుక్కలు చూపించింది. తెలుగులో ఈ సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నా... తమిళనాడులో ఇటీవల కాలంలో ధనుష్ నటించిన సినిమాలలో అతి తక్కువ ఓపెనింగ్స్ 'కుబేర'కే వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపధ్యంలో ధనుష్ కు సంబంధించిన ఓ పుకారు కోలీవుడ్ లో విపరీతంగా షికారు చేస్తోంది.
హీరో ధనుష్, డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran) మధ్య బంధం చాలా బలమైంది. తాజాగా వెట్రిమారన్... శింబు (Simbu) హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. దానికి సంబందించిన ప్రోమో షూట్ కూడా చేశాడు. గతంలో ధనుష్ - వెట్రిమారన్ కాంబోలో వచ్చిన 'వడ చెన్నయ్' (Vada Chennai) వరల్డ్ లోనే ఈ కొత్త సినిమా ఉండబోతోందట. 'వడ చెన్నయ్' చిత్ర నిర్మాణ భాగస్వామిగా ధనుష్ కూడా వ్యవహరించాడు. అందువల్ల ధనుష్ ప్రొడక్షన్ హౌస్ నుండి వెట్రిమారన్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కోరాడట. అది ఇవ్వడం కోసం ధనుష్ భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడంటూ కోలీవుడ్ లో ఓ పుకారు షికారు చేస్తోంది. గతంలో 'నానుమ్ రౌడీ దాన్' విషయంలో ఇలానే నయనతార (Nayantara)... ధనుష్ ను వేలెత్తి చూపించింది. ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు, క్లిప్పింగ్ వాడుకోవడానికి ధనుష్ అంగీకరించకపోగా, వర్కింగ్ స్టిల్ ను వాడుకున్నందుకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ కు, నెట్ ఫ్లిక్స్ వారికి నష్టపరిహారం కోరుతూ నోటీసులు పంపాడు. దాంతో సహజంగానే ఇప్పుడు కూడా వెట్రిమారన్ తో ఉన్న అనుబంధాన్ని మర్చిపోయి ధనుష్, ఎన్ఓసీ కోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేశాడని పుకార్లు మొదలయ్యాయి.
ఈ అంశం మీద ధనుష్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా... ఆయన సన్నిహితులు మాత్రం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వెట్రిమారన్ ఒకవేళ 'వడ చెన్నయ్' వరల్డ్ మూవీకి పర్మిషన్ అడిగితే ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఇవ్వమని ధనుష్ చెప్పాడని, ఆయన ఎలాంటి డబ్బునూ ఈ విషయంలో ఆశించడం లేదని వారు స్పష్టం చేశారు. నిజానికి దర్శకుడు వెట్రిమారన్... తమిళ స్టార్ హీరో సూర్యతో 'వాడి వాసల్' అనే మూవీ చేయాల్సి ఉంది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినందువల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కులేదు. దాంతో వెట్రిమారన్... శింబుతో కొత్త సినిమా మొదలు పెట్టేశాడు. అయితే ఇది 'వడ చెన్నయ్'కు సీక్వెల్ కాదని కేవలం ఆ యూనివర్స్ కు సంబంధించిన కథ అని మాత్రం చెప్పాడు.
ఇదిలా ఉంటే... ధనుష్ - వెట్రిమారన్ కాంబోలో ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. వెట్రిమారన్ దర్శకుడు అయ్యిందే ధనుష్ మూవీ 'పొల్లదావన్'తో. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 'ఆడుకాలమ్, వడ చెన్నయ్, అసురన్' చిత్రాలు చేశారు. అలానే 'వడ చెన్నయ్'కు వచ్చే యేడాది సీక్వెల్ చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. కొందరు కావాలని వీరిద్దరి మధ్య దూరం పెంచడానికి ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని, వారి మధ్య స్నేహాన్ని ఎవరూ చెరిపివేయలేరని ఇద్దరి గురించి తెలిసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: Hari Hara Veera Mallu: బాబీ డియోల్ పాత్ర మరింత శక్తివంతంగా...
Also Read: Kajal Aggarwal: బీచ్ ఒడ్డున బికినీలో అక్కాచెల్లెళ్ల ముద్దులాట..