Dhanush: ఆత్మను చంపేశారు.. ఏఐ క్లైమాక్స్ పై మండిపడ్డ ధనుష్

ABN , Publish Date - Aug 03 , 2025 | 10:50 PM

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చాకా అసాధ్యమైంది ఏదైనా సుసాధ్యంగా మారుస్తుంది. ఇది కొంతవరకు బావున్నా.. మరి కొన్ని విషయాల్లో ఇదే AI ఇబ్బంది పెడుతుంది.

Dhanush

Dhanush: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చాకా అసాధ్యమైంది ఏదైనా సుసాధ్యంగా మారుస్తుంది. ఇది కొంతవరకు బావున్నా.. మరి కొన్ని విషయాల్లో ఇదే AI ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఆ ఏఐ ఒక సినిమాలోని సోల్ ను చంపేసిందని కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) మండిపడ్డాడు. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. గతంలో థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకున్న సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేసి.. లాభాలను పొందుతున్నారు. ఇక ఈసారి ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఏకంగా క్లైమాక్స్ నే మార్చేశారు. ఆ సినిమానే రంఝానా.


ధనుష్, సోనమ్ కపూర్ జంటగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన రంఝానా సినిమా 2013 లో రిలీజ్ అయ్యి బాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రేమను కులమతాలు విడదీయడం, చివర్లో హీరో మరణించడం సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఏరోస్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాను దాదాపు 12 ఏళ్ళ తరువాత ఈ మధ్యనే రీరిలీజ్ చేసింది. అయితే ఈసారి క్లైమాక్స్ ను మొత్తం మార్చేసింది. చివర్లో ధనుష్ ను చంపేయకుండా బతికించి.. హ్యాపీ ఎండింగ్ ఇచ్చింది.


ఇక ఈ ఏఐ క్లైమాక్స్ పై ధనుష్ మండిపడ్డాడు. సినిమాలో ఉన్న సోల్ ను చంపేశారని మేకర్స్ పై ఫైర్ అయ్యాడు. హీరో, డైరెక్టర్ ను అడగకుండా క్లైమాక్స్ ను ఎలా మారుస్తారని విరుచుకుపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా ధనుష్ మాట్లాడుతూ.. 'ఏఐ క్లైమాక్స్ తో రీరిలీజ్ అయిన రంఝానా సినిమాను చూసి నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఈ అల్ట్రనేట్ ఎండింగ్ సినిమాలో ఉన్న ఆత్మను చంపేసింది. మేము వద్దు అన్నప్పటికీ మా అనుమతి లేకుండా ఈ క్లైమాక్స్ ను వారు ఉపయోగించారు. ఇది నేను 12 సంవత్సరాల క్రితం కమిట్ అయిన సినిమా కాదు. సినిమాలు లేదా కంటెంట్‌ను మార్చడానికి ఇలా ఏఐ ఆల్ట్రనేట్ ను ఉపయోగించడం కరెక్ట్ కాదు. ఇది కళకు, కళాకారులకు తీవ్ర ఇబ్బందిని కలిగించే పరిణామం. ఇది వారసత్వాన్ని బెదిరిస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి పద్ధతులను నిరోధించడానికి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని కోరుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Lenin: అయ్యగారి 'లెనిన్' ఆగిందా

3BHK: ఓటీటీలో దుమ్మురేపుతున్న ప్రతి మధ్యతరగతి తండ్రి కథ

Updated Date - Aug 03 , 2025 | 10:50 PM