Pradeep Ranganathan: హీరోయిన్లు ముఖం మీదే ‘నో’ అనేశారు
ABN, Publish Date - Dec 14 , 2025 | 07:48 AM
ఓరోజు ఒక తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ‘ఎవరబ్బా’ అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేశా. ‘హలో.. నేను రజనీకాంత్’ అని అట్నుంచి వినిపించింది. అంతే... నా నోట మాట రాలేదు.
వైరల్ వైబ్, క్యాచీ కంటెంట్, సాదా సీదా డైలాగులతో హీరోగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు... ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). ‘లవ్‌టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’... (Dude) బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ కోలీవుడ్ యంగ్ హీరో ఈసారి ‘ఎల్‌ఐకే’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ-LIK) తో సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లివి...
తలైవా నుంచి ఫోన్...
ఓరోజు ఒక తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ‘ఎవరబ్బా’ అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేశా. ‘హలో.. నేను రజనీకాంత్’ అని అట్నుంచి వినిపించింది. అంతే... నా నోట మాట రాలేదు. గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలెట్టింది. నా అభిమాన తలైవా స్వయంగా నాకు ఫోన్ చేసేసరికి షాక్‌కి గురయ్యా. నా సినిమా (లవ్‌టుడే)ని, అందులో నా నటనను అభినందించారు. ‘నువ్వు నిజాయితీతో కథలు రాస్తావు. ఆ నిజాయితీని ఎప్పటికీ కోల్పోకు’ అన్నారు. అది నా కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని మాట.
మొదటి షార్ట్‌ఫిల్మ్...
కాలేజీలో ఉన్నప్పుడే షార్ట్‌ఫిల్మ్స్ తీయడం మొదలెట్టా. కేవలం ఐదు వందలతో నా మొదటి షార్ట్‌ఫిల్మ్ పూర్తి చేశా. కట్‌చేస్తే.. అది బాగా వైరలైంది. యూట్యూబ్ నుంచి రూ. 40 వేలు రెవెన్యూ వచ్చింది. ఆ డబ్బుతో మంచి కెమెరా కొని రెండో షార్ట్ ఫిల్మ్ చేశా. కాలేజీ చదువు పూర్తవ్వగానే ఐటీ ఉద్యోగంలో చేరా. ఏడాదిన్నర తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి, కథలు పట్టుకుని ప్రొడక్షన్ హౌస్‌లు చుట్టూ తిరిగా. చాలామంది నిర్మాతలు కథ పూర్తిగా వినకముందే రిజక్ట్ చేసి వెళ్లిపోయేవారు.
నాన్న వెరీ సింపుల్...
మా నాన్న జిరాక్స్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించారు. నాకు సినిమాలతో పేరు, డబ్బు వచ్చినా... ఇప్పటికీ దాన్ని నడుపుతూనే ఉన్నారు. మన మూలాలు మరిచిపోకూడదనేది ఆయన సిద్ధాంతం. రోజూ బస్సులోనే షాప్‌కు వెళ్తారు. కారు కొనిస్తానని చెప్పినా సింపుల్‌గా వద్దన్నారు. ఆయనకు ఆర్భాటాలు లేకుండా, మామూలుగా బతకడమే ఇష్టం. ఆయనే నాకు స్ఫూర్తి.
ముఖం మీదే ‘నో’ అన్నారు...
‘లవ్‌టుడే’లో హీరోయిన్ కోసం ఎంతో మందిని సంప్రదించా. నేను హీరో అనగానే చాలామంది హీరోయిన్లు ముఖం మీదే ‘నో’ అనేశారు. కొందరేమో డేట్స్ లేవంటూ ఏవేవో కారణాలు చెప్పారు. మరికొందరేమో పెద్ద స్టార్స్‌తో మాత్రమే చేస్తామని చెప్పారు. ఆ సమయంలో నా మీద నాకే చాలా అనుమానాలు కలిగాయి. అయితే సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల స్పందన చూసి, నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది.
కారు గిఫ్ట్‌గా ...
నేను డైరెక్ట్ చేసిన ‘కోమలి’ హిట్ అయిన తర్వాత ఆ సినిమా నిర్మాత నాకొక కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ ఆ సమయానికి నా దగ్గర పెట్రోల్ కొట్టించే డబ్బు కూడా ఉండేది కాదు. దాంతో కారును మెయింటేన్ చేయడం నాకు తలకు మించిన భారం అనిపించింది. అందుకే కారు తిరిగి ఇచ్చేసి, కొంత సొమ్ము తీసుకున్నా. ఆ డబ్బుతోనే ఇండస్ట్రీలో మూడేళ్లు బతికా.
స్క్రిప్ట్ రాసేటప్పుడు బ్యాగ్రౌండ్‌లో సాఫ్ట్ బీజీఎమ్ లేదా రెయిన్ సౌండ్ పెట్టుకుంటా. ఎమోషనల్ సీన్స్ రాయాల్సి వస్తే.. పియానో మ్యూజిక్ పెట్టుకుంటా.
నాకు రాత్రిపూట ఒంటరిగా నడవడం ఇష్టం. ఆ సమయంలోనే కొత్త కొత్త స్టోరీ ఐడియాలు వస్తుంటాయి. వెంటనే ఫోన్ ఓపెన్ చేసి అవన్నీ నోట్ చేసుకుంటా. చెప్తే నమ్మరు... నా ఫోన్‌లో 500+ ఐడియాలు నోట్ చేసి పెట్టుకున్నా.
నాకు ఇష్టమైన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. అలాంటి ఎమోషన్ థ్రిల్లర్‌లో నటించాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా.
ఖాళీ సమయం దొరికితే.. యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్స్ చూస్తుంటా.
అందరూ నన్ను చూసి సీరియస్ పర్సన్ అనుకుంటారు. కానీ నేను ఫుల్ కామెడీ బ్యాచ్ టైపు.
ఫటాఫట్
ఇండస్ట్రీకి రాకపోయుంటే: సైకాలజీ రీసెర్చర్ అయ్యిండేవాడిని.
నా గురించి మూడు పదాల్లో అంటే: అబ్జర్వ్, థింక్, క్రియేట్.
ఇష్టమైన కమెడియన్: వడివేలు. ఆయన కామెడీ టైమింగ్‌కి నేను పెద్ద ఫ్యాన్.'
అభిమాన హీరోయిన్: శ్రీదేవి.