సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anaswara Rajan: ఆ ఒంటరితనమే నన్ను దృఢంగా మార్చింది..

ABN, Publish Date - Dec 21 , 2025 | 06:52 AM

స్కూల్‌డేస్‌లోనే బాలనటిగా నేను సినిమాల్లో నటిస్తున్న కారణంగా ఎన్నో మాటలు పడ్డా. నా తోటి విద్యార్థులెవరూ నాతో కలిసేవారు కాదు. టీచర్లే నాతో మాట్లాడొద్దని వాళ్ల తల్లిదండ్రులతో చెప్పించేవాళ్లు. క్లాసులో మార్కులు కాస్త తక్కువగా వస్తే.. ‘నువ్వు చదవకపోయినా నీకేం కాదులే. నీకు ఎలాగూ సినిమాలు ఉన్నాయిగా’ అంటూ వెక్కిరించేవారు.

Anaswara Rajan

అనశ్వర రాజన్‌... మలయాళంలో బాలనటిగా కెరీర్‌ మొదలెట్టి, లో బడ్జెట్‌, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు వన్‌ అండ్‌ ఓన్లీ ఆప్షన్‌గా ఎదిగింది. ఆ తర్వాత మలయాళం, తమిళంలో వరుస అవకాశాలు కొట్టేస్తూ... ‘ఛాంపియన్‌’తో తెలుగులోనూ సత్తా చాటుకునేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ మలయాళ బ్యూటీ పంచుకున్న ముచ్చట్లివి...

ఆ మాటలు బాధించేవి

స్కూల్‌డేస్‌లోనే బాలనటిగా నేను సినిమాల్లో నటిస్తున్న కారణంగా ఎన్నో మాటలు పడ్డా. నా తోటి విద్యార్థులెవరూ నాతో కలిసేవారు కాదు. టీచర్లే నాతో మాట్లాడొద్దని వాళ్ల తల్లిదండ్రులతో చెప్పించేవాళ్లు. క్లాసులో మార్కులు కాస్త తక్కువగా వస్తే.. ‘నువ్వు చదవకపోయినా నీకేం కాదులే. నీకు ఎలాగూ సినిమాలు ఉన్నాయిగా’ అంటూ వెక్కిరించేవారు. ఆ మాటలు నన్నెంతో బాధించేవి. దాంతో ఒంటరిగా ఫీలై వెక్కివెక్కి ఏడ్చేదాన్ని. ఆ ఒంటరితనమే నన్ను ఈ రోజు దృఢంగా మార్చిందనిపిస్తుంది.

గారాలపట్టిని...

నేను కేరళలోని కరివెల్లూరులో జన్మించా. నాకొక అక్క ఉంది. చిన్నదాన్ని కావడంతో అల్లారుముద్దుగా, గారాలపట్టిలా పెరిగా. ఏ రోజూ నాపై ఆంక్షలు పెట్టలేదు. ఎప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహించేవారు. మా అమ్మకైతే నేనే ప్రపంచం. అమ్మమ్మ చనిపోయిన రోజే నేను పుట్టానట. దాంతో అమ్మమ్మే నా రూపంలో పుట్టిందని అమ్మ భావిస్తుంది. నాలో వాళ్ల అమ్మని చూసుకుంటూ మురిసిపోతుంది.

హైపర్‌గా కనిపిస్తా...

‘ఛాంపియన్‌’ సినిమాలో తాళ్లపూడి చంద్రకళగా నటించా. అచ్చమైన తెలుగమ్మాయిగా, హైపర్‌ యాక్టివ్‌గా ఉంటా. ఆ పాత్ర కోసం సెట్‌లోనూ అదే ఎనర్జీతో ఉండేదాన్ని. రియల్‌ లైఫ్‌లో మాత్రం నేను చాలా కూల్‌గా ఉంటా. మొదట్లో తెలుగు కాస్త కష్టంగా అనిపించినా... భాషలోని మాధుర్యం అర్థమయ్యాక తెలుగుపై ప్రేమ పెరిగింది. ‘గిర గిరా’ పాట విడుదలైన కొద్దిసేపటికే నా ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌లతో నిండిపోయింది. తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమ అద్భుతం.

బాలనటిగా మొదలై ...

చిన్నప్పటి నుంచి నటన అంటే పిచ్చి. స్కూల్‌లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. 2017లో ‘ఉదాహరణం సుజాత’ తో బాలనటిగా సినీ ప్రయాణాన్ని మొదలెట్టా. మరో రెండేళ్లకు ‘తన్నీర్‌ మాతన్‌ దినంగళ్‌’లో లీడ్‌ క్యారెక్టర్‌ చేశా. అదే ఏడాది ‘అద్యరాత్రి’లో తల్లీకూతుళ్లుగా డ్యూయల్‌ రోల్‌ చేశా. 2022లో ‘సూపర్‌ శరణ్య’ కమర్షియల్‌గా నాకు పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తమిళంలోకి, ‘యారియన్‌ 2’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చా. తాజాగా ‘ఛాంపియన్‌’తో తెలుగులోనూ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నా.

అలాంటి పాత్రలు చేయను

సినిమాల ఎంపికలో నాకంటూ ప్రత్యేక దృష్టికోణం ఉంది. సినిమా ఓకే చేసేముందు... ‘ఆ పాత్ర నుంచి నేనేం నేర్చుకోగలుగుతాను?’ అని నన్ను నేను ప్రశ్నించుకుంటా. సమాధానం దొరికితేనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తా. సమాజాన్ని తప్పుదారి పట్టించే పాత్రల్లో ఎప్పటికీ నటించను. దర్శకుడిని చూసో, హీరోని చూసో సినిమా ఓకే చేయడం నాకు నచ్చదు. కథే నాకు ముఖ్యం. మూస పాత్రలకు దూరంగా ఉంటా. వింటేజ్‌ పాత్రల్లో నటించడమంటే చాలా ఇష్టం.

పర్సనల్‌ ఛాయిస్‌

లెజెండరీ మోహన్‌లాల్‌తో కలిసి ‘నెరు’ సినిమాలో అంధురాలిగా కనిపించా. ఆయన చిన్న ఎక్స్‌ప్రెషన్‌ని కూడా ఎంత కంట్రోల్డ్‌గా ఇస్తారో చూసి ఆశ్చర్యపోయా.

నేను ఫోటోషూట్స్‌, షోలకి వేసుకునే డ్రెస్సులన్నీ నావే.

డిజైనర్లు పంపినవి కావు.

మూడ్‌ బాగోలేనప్పుడు గదిలోకి వెళ్లి నిద్రపోతా.

దాంతో నా మూడ్‌ సెట్‌ అవుతుంది.

చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తా. ఒక నిర్ణయానికి రావడానికి చాలా సమయం తీసుకుంటా.

Updated Date - Dec 21 , 2025 | 10:51 AM