Kota Srinivasarao: చిరుతో మొదలు... పవన్‌తో ముగింపు
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:47 PM
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావును పోల్చదగ్గ నటుడు తెలుగు సినిమా రంగంలో వేరొకరు లేరు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు వైవిధ్యభరితమైన పాత్రలను సునాయాసంగా పోషించిన గుణచిత్ర నటుడు కోట శ్రీనివాసరావు. అయితే ఆయన సినీ ప్రయాణంలో మెగా కుటుంబానికి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది.
కోట శ్రీనివాసరావు కెరీర్ సుదీర్ఘ కాలం సాఫీగా సాగిపోవడానికి టి. కృష్ణ దర్శకత్వం వహించిన 'ప్రతిఘటన' చిత్రం గట్టి పునాదిని వేసిన మాట వాస్తవం. అయితే ఆయన సినీ ప్రయాణం మొదలైంది మాత్రం చిరంజీవి నటించిన 'ప్రాణం ఖరీదు' మూవీతో. రచయిత సి.ఎస్. రావు రాసిన 'ప్రాణం ఖరీదు' నాటకాన్ని రంగస్థలంపై ఆడిన కోట శ్రీనివాసరావుకు ఆ చిత్ర నిర్మాత క్రాంతి కుమార్ మూవీలోనూ ఛాన్స్ ఇచ్చారు. అలా 'ప్రాణం ఖరీదు' చిత్రంలో తొలిసారి వెండితెరపై కనిపించారు కోట శ్రీనివాసరావు. అలానే ఆయన చనిపోయిన తర్వాత జనం ముందుకు వస్తున్న తొలి చిత్రం కూడా మెగా ఫ్యామిలీకి చెందిందే! అదే ఎ.ఎం. రత్నం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'హరిహర వీరమల్లు'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ దైవేచ్ఛ ఇలా ఉందేమో... కోట శ్రీనివాసరావు చనిపోయిన పదకొండు రోజులకు 'హరిహర వీరమల్లు' జనం ముందుకు వస్తోంది. ఆ రకంగా కోటను చివరి సారి వెండితెరపై ఆయన అభిమానులు, తెలుగు సినీ లోకం మరోసారి చూసుకునే ఛాన్స్ దక్కుతోంది.
ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమంటే... ఇటు చిరంజీవి, అటు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ రాజకీయ నేపథ్యం ఉంది. చిరంజీవి రాజ్యసభకు ఎన్నికై ఆ తర్వాత కేంద్రమంత్రిగా సేవలు అందించారు. అలానే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. విశేషం ఏమంటే... 1999 నుండి 2004 వరకూ కోట శ్రీనివాసరావు సైతం విజయవాడ తూర్పు అసెంబ్లీ నుండీ బీజేపీ అభ్యర్థిగా గెలిచి, ప్రజాసేవ చేశారు. అలా సినీ, రాజకీయ రంగాలతో చిరు, పవన్ కు మాదిరే కోటకూ మంచి అనుబంధం ఉంది.
ఇక 'హరిహర వీరమల్లు' సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు పెద్ద దొర పాత్ర చేశారని తెలుస్తోంది. హరిహర వీరమల్లులోని తెగింపు, చాకచక్యాన్ని గమనించి, అతన్ని పల్నాడు నుండి హైదరాబాద్ లోని తానీషా దగ్గరకు ఓ కార్యం నిమిత్తం పంపేందుకు కోట శ్రీనివాసరావు పాత్ర సహకరిస్తారని అంటున్నారు. సినిమాలో కోట శ్రీనివాసరావు కనిపించేది మూడు, నాలుగు సన్నివేశాలే అయినా... అవి ప్రభావవంతంగా ఉంటాయట! అయితే... ఆయన అనారోగ్యం కారణంగా ఈ పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించారని తెలుస్తోంది. ఏదేమైనా గొప్ప నటుడిగా తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్రవేసిన కోట శ్రీనివాసరావు తొలి చిత్రం చిరంజీవి 'ప్రాణం ఖరీదు' కావడం... చనిపోయిన తర్వాత వస్తున్న చిత్రం పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' కావడం విశేషమే!
Also Read: Bellamkonda: 'కిల్'తో బెల్లంకొండ
Also Read: Tanya Ravichandran: లిప్ లాక్ పెట్టి మరీ ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్