Bhavana Case: అసలు నిందితుడు స్వేచ్ఛగా తిరుగుతున్నారు.. భయంకర విషయమది

ABN , Publish Date - Dec 15 , 2025 | 08:51 PM

‘8 ఏళ్ల 9 నెలల 23 రోజుల బాధకరమైన ప్రయాణంలో ఇప్పుడు ఉపశమనం కలిగినట్టుగా ఉంది’ అంటూ మలయాళ నటి భావన మీనన్‌ భావోద్వేగ పోస్ట్‌ చేశారు.

‘8 ఏళ్ల 9 నెలల 23 రోజుల బాధకరమైన ప్రయాణంలో ఇప్పుడు ఉపశమనం కలిగినట్టుగా ఉంది’ అంటూ మలయాళ నటి భావన మీనన్‌ (Bhavana menon) భావోద్వేగ పోస్ట్‌ చేశారు. మలయాళ నటి భావన లైంగిక దాడి కేసులో ఎర్నాకుళం సెషన్స్‌ కోర్టు ఇటీవల తీర్పు వచ్చిన సంగతి తెలిసిందే! ఈ కేసులో ఆరుగురిని దోషులుగా తేల్చిన కోర్టు వారికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుపై బాధిత నటి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. అందులో కొన్ని అంశాలను ప్రస్తావించారు. అంతా అనుకుంటున్నట్లు ఏ1 అనుమానితుడు నా పర్సనల్‌ డ్రైవర్‌ కాదు. నా ఉద్యోగి కాదు. అవన్నీ అబద్దాలు. అప్పట్లో నేను నటించిన ఓ సినిమా నిర్మాణ సంస్థ తరఫు డ్రైవర్‌ అతడు. ఆ ఘటన ముందు అతడిని ఒకట్రెండు పార్లు చూశానంతే. దయచేసి వదంతులు వ్యాప్తి చేయడం ఆపండి. ఈ తీర్పులో న్యాయం లేదు. నన్నేమీ సర్‌ప్రైజ్‌ చేయలేదు. ఈ కేసులో ఏదో పొరపాటు జరుగుతోందని 2020లోనే నాకు అనిపించింది. ఈ కేసు విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టును పలుమార్లు ఆశ్రయించి.. ట్రయల్‌ కోర్టుపై నమ్మకం లేదని చెప్పా. నేను ప్రయత్నం చేసిన ప్రతిసారీ నా విజ్ఞప్తిని తిరస్కరించేవారు. ఈ ప్రయాణంలో చట్టం ముందు అందరూ సమానులు కారని అర్థమైంది. ఇప్పటివరకూ నాకు సపోర్ట్‌ చేసిన వారందరికీ కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చారు.



ఈ పోస్టుపై నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran) స్పందించారు. ఆమె చేసిన పోస్టును తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసి నమస్కారం చేస్తున్న ఎమోజీని జోడించి ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ కేసులో నిర్దోషిగా తేలిన నటుడు దిలీప్‌ మాజీ భార్య మంజు వారియర్‌ కూడా నటి భావనకు మద్దతు పలికారు. తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని, కానీ ఈ కేసులో బాధితురాలికి పూర్తి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ‘నేరం చేసిన వారికి శిక్ష పడింది. కానీ, ఈ దారుణానికి ప్లాన్‌ చేసిన వ్యక్తి మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అది భయంకరమైంది. ఈ నేరం వెనక ఉన్న వారందరికీ శిక్ష పడినప్పుడే పూర్తి న్యాయం దక్కినట్లు అవుతుంది’ అని మంజు వారియర్‌ అన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 09:38 PM