Music Director: ఫస్ట్ మూవీ సెంటిమెంట్ సంగతేంటీ...
ABN , Publish Date - Jul 07 , 2025 | 04:30 PM
ప్రస్తుతం ఆల్ ఇండియా నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా సాగుతున్నారు అనిరుధ్ రవిచందర్. అయితే అనిరుధ్ ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. అదేంటి? అది అనిరుధ్ కు ప్లస్సా - మైనస్సా - ఆ ముచ్చటేంటో చూద్దాం.
ఉత్తరం-దక్షిణం అన్న తేడా లేకుండా అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం కోసం అనేకమంది పోటీ పడుతున్నారు. అనిరుధ్ బాణీలు కడితే చాలు తమ సినిమా సూపర్ హిట్ అయిపోతుందనే నమ్మకంతోనూ ఎందరో ఉన్నారు. కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) తన భారీ చిత్రం 'టాక్సిక్' (Toxic) కు అనిరుధ్ రవిచందర్ నే సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. అయితే ఎన్నో ఏళ్ళుగా అనిరుధ్ ను వెంటాడుతున్న ఓ సెంటిమెంట్ ను ఇప్పుడు కన్నడనాట సినీజనం గుర్తు చేసుకుంటున్నారు. అదేమిటంటే - అనిరుధ్ తొలిసారి ఏ భాషలోనైనా మ్యూజిక్ కంపోజ్ చేస్తే సదరు సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుందట! ఆ సెంటిమెంట్ ను పట్టుకొని యశ్ 'టాక్సిక్'తోనైనా అనిరుధ్ ఆ సెంటిమెంట్ ను అధిగమిస్తాడా అని కొందరు అంటున్నారు.
అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకునిగా పరిచయమైన తొలి చిత్రం తమిళంలో రూపొందిన '3'. ఈ సినిమాలోని "వై దిస్ కొలవరి." సాంగ్ అప్పట్లో భలేగా ఊపేసింది. అయితే సినిమా మాత్రం వారం కూడా చూడకుండా థియేటర్ల నుండి పరుగు తీసింది. '3' సినిమా ఫ్లాప్ అయినా, అనిరుధ్ బాణీలు ఆకట్టుకున్నాయిగా అనీ కొందరు అన్నారు. దాంతో కొందరు నిర్మాతలు, దర్శకులు అనిరుధ్ లోని టాలెంట్ కు పీట వేశారు. ఆ తరువాత అనిరుధ్ సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు. కానీ, '3' మూవీ రిజల్ట్ ను మాత్రం జనం మరచిపోలేకుండా ఉన్నారు.
అనిరుధ్ కు తొలి హిందీ చిత్రం విక్రమ్ హీరోగా రూపొందిన 'డేవిడ్'. హిందీ, తమిళ భాషల్లో రూపొందిన 'డేవిడ్'లో ఒకే ఒక్క పాటను అనిరుధ్ కంపోజ్ చేశారు. తమిళంలో 'కనవే కనవే.' అంటూ సాగే పాట హిందీలో "యూ హీ రే." అంటూ అలరించింది. 'డేవిడ్' అంతగా మురిపించలేకపోయింది. తరువాత హిందీలో తెలుగు 'జెర్సీ' రీమేక్ కు కేవలం నేపథ్య సంగీతం అందించారు అనిరుధ్. ఆ సినిమా పరాజయం పాలయింది. ఆ తరువాతే షారుఖ్ ఖాన్ 'జవాన్'కు బంపర్ హిట్ పట్టేలా మ్యూజిక్ కంపోజ్ చేశారు అనిరుధ్. ఇక తెలుగులో అనిరుధ్ తొలి సినిమా 'అజ్ఞాతవాసి' ఫలితం గురించి అందరికీ తెలిసిందే.. మళయాళంలో 2024లోనే ఓ సినిమాకు అనిరుధ్ స్వరాలు అందిస్తారని వినిపించింది. అయితే అక్కడ ఇప్పటి దాకా అనిరుధ్ బాణీలు సాగలేదు. ఈ నేపథ్యంలో యశ్ తన 'టాక్సిక్' కన్నడ చిత్రానికి అనిరుధ్ ను సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. కన్నడలో అనిరుధ్ కు 'టాక్సిక్' మొదటి సినిమా. మరి ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఓ వేళ 'టాక్సిక్' హిట్టయితే ఇప్పటి దాకా అనిరుధ్ పై ఉన్న సెంటిమెంట్ చెరిగిపోతుందని అంటున్నారు. చూద్దాం. ఏమవుతుందో!?
Also Read: Telugu Film Chamber: బై లా ప్రకారమే అంతా...
Also Read: Tollywood: సాయికిరణ్ అడివికి కోపమొచ్చింది...