Mani Ratnam: థగ్ లైఫ్ డిజాస్టర్.. గట్టిగానే ప్లాన్ చేసిన మణిరత్నం

ABN , Publish Date - Dec 07 , 2025 | 09:51 PM

స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Mani Ratnam

Mani Ratnam: స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవ్వడానికి తమిళ్ డైరెక్టర్ అయినా కూడా తెలుగులో ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఒకప్పుడు మణిరత్నం సినిమాలు అంటే కళ్ళు మూసుకొని థియేటర్ లోకి వెళ్ళిపోయేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొంతకాలంగా ఆయన సినిమాలు భారీ పరాజయాలను అందుకుంటున్నాయి. పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్ లు తమిళ్ లో విజయాన్ని అందుకున్నా తెలుగులో మాత్రం అంతంత మాత్రంగానే ఆడాయి.

ఇక ఈ ఏడాది థగ్ లైఫ్ తో మణిరత్నం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వనటుడు కమల్ హాసన్ తో నాయకుడు సినిమా తరువాత మణిరత్నం కలిసి పనిచేసిన చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రిలీజ్ సమయంలో భాషా వివాదం రగిలి అంచనాలను తారుమారు చేసింది. సరే కథ బావుంటే అన్ని వాటంతట ఏవ్ సర్దుకుంటాయిలే అని ఎన్నో ఆశలతో థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడికి నిరాశే మిగిలింది. ఇది మణిరత్నం సినిమానా.. ? ఇలాంటి చెత్త సినిమాను మణిరత్నం డైరెక్ట్ చేసారంటే నమ్మలేకపోతున్నామని ప్రేక్షకులు గగ్గోలు పెట్టారు.

థగ్ లైఫ్ .. మణిరత్నం కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ పేరును పోగొట్టుకోవడానికి ఆయన పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే విజయ్ సేతుపతితో ఒక సినిమా చేయడానికి మణిరత్నం ఫిక్స్ అయ్యినట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో నవాబ్ సినిమా వచ్చింది. ఇది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. విజయ్ కి బాగా సెట్ అయ్యే కథ అని, ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవిని అనుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సఖి, ఓకే బంగారం లాంటి రొమాంటిక్ స్క్రిప్ట్ తోనే మణిరత్నం ముందుకు రానున్నాడట. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్ బావుంది.. కథ కూడా దానికి తగ్గట్లు ఉంటే కచ్చితంగా మణిరత్నం బౌన్స్ బ్యాక్ అవుతాడని నెటిజన్స్ అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలి.

Updated Date - Dec 07 , 2025 | 09:52 PM