Lokah: బాక్సాఫీస్ వద్ద.. కొత్త లోకా వీరంగం! టాప్2 లోకి ఎంట్రీ
ABN, Publish Date - Sep 15 , 2025 | 12:13 PM
గత నెల చివరి వారంలో ప్రేక్షకుల ఎదుటకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్టులు తిరగరాస్తున్న చిత్రం లోకా.
గత నెల చివరి వారంలో ప్రేక్షకుల ఎదుటకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్టులు తిరగరాస్తున్న చిత్రం లోకా (Lokah ). తెలుగులో కొత్త లోక (Kotha Lokah) గా విడుదలైంది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నిర్మించిన ఈ సూపర్ హీరో మూవీ యూనివర్స్‌లో మొదటి భాగం చంద్రలో కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) కథానాయికగా నటించగా ప్రేమలు నస్లేన్ (Naslen) ప్రధాన పాత్ర చేశాడు. ఇప్పటికే సినిమా రిలీజై మూడు వారాలు దాటినా ఇంకా కేరళలోనే కాక అన్ని చోట్లా పవర్‌ఫుల్‌గా రన్ అవుతూ అద్భుతమైన వసూళ్లతో దుమ్మురేపుతోంది. డామ్నిక్ అరుణ్ దర్శకత్వంలో ఫాంటసీ అడ్వంచర్ జానర్‌లో వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.30 కోట్లతో తెరకెక్కించడం విశేషం.
అయితే.. అందుతున్న సమాచారం మేరకు కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో మలయాళ చిత్రంగా నిలిచింది. సినిమా వచ్చిన 17వ రోజు శుక్రవారానికి రూ.232 కోట్లు రాబట్టిన ఈ మూవీ 18వ రోజు ఆదివారం వచ్చేసరికి ఇప్పటివరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) సినిమా వసూల్లు రూ.242 కోట్లను అధిగమించి ఆ స్థానంలోకి వచ్చింది. ఇక రూ.266 కోట్లతో మోహన్ లాల్ ఎంపురాన్ (L2: Empuraan) ప్రథమ స్థానంలో ఉంది. మరో వారం పది రోజుల్లో దానిని సైతం అధిగమించి రూ.300 కోట్ల క్లబ్‌లో సైతం చేరుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. తెలుగులో కొత్త లోకాగా వచ్చిన ఈ సినిమా పెట్టిన రూ.3 కోట్ల పెట్టుబడిని మించి దాదాపు రూ.17 కోట్ల గ్రాస్ రూ.9.5 కోట్ల షేర్ సాధించి తెలుగులో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న మలయాళ అనువాద చిత్రంగా పేరు నమోదు చేసుకోవడం గమనార్హం. ఇదిలాఉంటేఈ సినిమా సిరీస్‌లో ఐదుగురు సూపర్ హీరోల కథలతో ఓ కొత్త యూనివర్స్‌ను సృష్టించారు. తర్వాతి కథలలో మమ్ముట్టి, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ వంటి వారు నటిస్తుండడం విశేషం. చూడాలి మరి మున్ముందు ఈ సినిమా ఇంకా ఎన్ని రికార్డులు నెలకొల్పుతుందో.