సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Saroja Devi: అభినయ సరస్వతికి అశ్రునివాళి.. చలించిన చందనసీమ

ABN, Publish Date - Jul 15 , 2025 | 05:25 PM

ఆరు దశాబ్దాల సినిమా రంగంలో దక్షిణాది భాషల్లో రాణించి బాలీవుడ్‌లోనూ నటనా చాతుర్యంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా కొనసాగిన అభినయ సరస్వతి సరోజాదేవి.

Saroja Devi

ఆరు దశాబ్దాల సినిమా రంగంలో దక్షిణాదిన కన్నడ, తెలుగు, తమిళభాషల్లో రాణించి బాలీవుడ్‌లోనూ నటనా చాతుర్యంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా కొనసాగిన అభినయ సరస్వతి బీ సరోజాదేవి (87) (Saroja Devi) క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. వయోభారం ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె సోమవారం ఉదయం దినపత్రికలు చదివి టీవీలో కార్యక్రమాలు చూస్తూనే కుప్పకూలారు. ఆ వెంటనే మల్లేశ్వరంలోని ఇంటికి సమీపంలోని మణిపాల్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే ఆమె తుదిశ్వాస వీడారని వైద్యులు నిర్ధారించారు.

చందనసీమలో ఆరు దశాబ్దాలు అగ్ర నటిగా కొనసాగి కన్నడలో ప్రముఖ హీరోల చారిత్రాత్మక సినిమాలలో హీరోయిన్‌గా రాణించిన సరోజాదేవి కన్నుమూశారనే విషయం తెలియగానే చందనసీమ మూగబోయినట్లు అయింది. హుటాహుటిన పలువురు నటులు మల్లేశ్వరంలోని సరోజాదేవి నివాసానికి చేరుకున్నారు. నటుడు ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక, ప్రకాశ్‌రాజ్‌, సుప్రిత, శ్రీవాణి, మాలాశ్రీ, తార అనురాధ, సాధుకోకిల, గురుకిరణ్‌, జగ్గేశ్‌, జై జగదీశ్‌, సారా గోవిందు, యోగరాజ్‌భట్‌, బ్రహ్మాండ గురూజీలు కడపటి నివాళులు అర్పించారు. మాజీ సీఎంలు బసవరాజ్‌ బొమ్మై, వీరప్పమొయిలీ, ఎమ్మెల్సీ శరవణ, ఎమ్మెల్యే గాలి జనార్ధనరెడ్డి, ప్రతిపక్షనేత ఆర్‌ అశోక్‌, కుమార బంగారప్ప తదితరులు నివాళులు అర్పించారు.

ఒకప్పటి మైసూరు సంస్థానం చన్నపట్టణ పరిధిలోని దశవార గ్రామంలో 1938 జనవరి 7న ఒక్కలిగ కుటుంబంలో జన్మించారు. తండ్రి బైరప్ప మైసూరులో పోలీసు అధికారి కాగా తల్లి రుద్రమ్మ గృహిణి. దంపతులకు నాల్గవ‌ సంతానంగా సరోజాదేవి జన్మించారు. 17వ యేట కన్నడ సినిమాలో అడుగు పెట్టారు. మహాకవి కాళిదాస 1955లో నటించడం ద్వారా ఆమెకు ఎంతో పేరు వచ్చింది. ఓవైపు కన్నడ సినిమాలలో నటిస్తూనే తెలుగు, తమిళ భాషల్లోనూ కొనసాగారు.

కన్నడలో డాక్టర్‌ రాజ్‌కుమార్‌, కల్యాణ్‌కుమార్‌, ఉదయ్‌కుమార్‌, తెలుగులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, తమిళంలో జెమినీ గణేశన్‌, శివాజి గణేశన్‌, ఎంజీ రామచంద్రన్‌తోపాటు హిందీలో దిలీప్ కుమార్‌, రాజేంద్రకుమార్‌, షమ్మికపూర్‌, సునిల్‌దత్‌లతో కలసి నటించారు. 200 సినిమాలకు గాను 161 సినిమాల్లో హీరోయిన్‌గానే నటించారు. ఆపై సరోజాదేవి 1967 మార్చి 1న జర్మనీలో మెకానికల్‌ ఇంజనీర్‌ శ్రీహర్షను పెళ్లి చేసుకోగా 1986లో ఆయ‌న‌ గుండెపోటుతో కన్నుమూయ‌డంతో ఆమె కొంతకాలం కోలుకోలేకపోయారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కాగా పెద్దకుమార్తె మృతి చెందింది.

స‌రోజా దేవి మృతి సంద‌ర్భంగా ప‌లువురు క‌న్న‌డ న‌టులు ఆమె భౌతిక‌కాయాన్ని సంద‌ర్శించి క‌డ‌సారి వీడ్కోలు ప‌లికారు. ఈ సంద‌ర్బంగా స్టార్ హీరో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ.. సరోజాదేవి తమకు తల్లిలాంటి వారని, ఆమె మృతి చెందిన విషయం తెలియగానే మనసు కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. అప్పాజీ రాజ్‌కుమార్‌తో ఎన్నో సినిమాల్లో నటించారన్నారు. మమ్మల్ని బిడ్డలుగా చూసేవారని, ఆ అభిమానం ఎప్పటికీ మరువలేమన్నారు. రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ తనను చూసిన ప్రతిసారి ఓ బిడ్డలా అభిమానం చూపారని, ఆమెకు నివాళులర్పించే పరిస్థితి రావడం బాధ కలుగుతోందన్నారు.

సరోజాదేవి అంత్యక్రియలు మంగళవారం చన్నపట్టణ తాలూకా పరిధిలోని దశవార గ్రామంలో నిర్వహించారు. మల్లేశ్వరం లోని రుద్రమ్మ నివాసం నుంచి పార్థివదేహాన్ని తరలించి అధికార లాంఛనాల మ‌ధ్య‌ అంత్యక్రియలు నిర్వహించిన‌ట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగ‌ళ‌వారం అంత్య‌క్రియ‌ల స‌మ‌యంలో క‌ర్ణాల‌క ముఖ్య‌మంత్రి సిద్ద రామ‌య్య‌తో పాటు అనేక మంది రాజ‌కీయ ప్ర‌ముఖులు కార్య‌క్ర‌మంలో పాల్గొని వీడ్కోలు ప‌లికారు.

ఇదిలాఉంటే.. బీ సరోజాదేవికి మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణతో పెళ్లి జరగాల్సి ఉండేది. ఇద్దరి మధ్యా పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. వేర్వేరు రంగాలు కావడంతో వివాహం చేసుకోలేదు. సరోజాదేవి దూరదృష్టి కల్గినవారు. ఆమె 70 ఎకరాల భూమిని రామనగర జిల్లాలో కొనుగోలు చేశారు. సదాశివనగర్‌, మల్లేశ్వరంలో నివాసాలు ఉన్నాయి. నెలమంగలతో పాటు పలుచోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jul 15 , 2025 | 05:37 PM