Manya Anand: ఆ వార్తలు ఫేక్.. ధనుష్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు
ABN, Publish Date - Nov 20 , 2025 | 10:33 AM
ధనుష్, మేనేజర్ శ్రేయాస్‌పై తాను వ్యాఖ్యలు చేశానని వస్తున్న ప్రచారాన్ని నటి మాన్య ఆనంద్ ఖండించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేశారు.
హీరో ధనుష్ (Dhanush), ఆయన మేనేజర్ శ్రేయాస్ (Shreyas)కు వ్యతిరేకంగా తాను మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి యువ నటి మాన్య ఆనంద్ (Manya Anand) ఫుల్‌స్టాప్ పెట్టారు. వారిద్దరి గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తనను లక్ష్యం చేసుకోవద్దని కోరారు.
ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ధనుష్ మేనేజర్ శ్రేయాస్ అనే పేరుతో ఒక వ్యక్తి తనతో అసభ్యంగా మాట్లాడారని, అలా మాట్లాడింది ఆయనేనా అనే సందేహం కలుగుతోందన్నారు.
ఈ వీడియో కొన్ని నిమిషాల్లో వైరల్ అయింది. దీంతో పలువురు నెటిజన్లు ధనుష్, ఆయన మేనేజరు శ్రేయాస్‌సలపై విమర్శలు గుప్పించారు. ఇది పెద్ద వివాదానికి దారితీసేలా కనిపించడంతో మాన్య ఆనంద్ స్పందించారు.
‘నేను ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని విష ప్రచారానికి తెరలేపారు. నన్ను సంప్రదించిన వారు శ్రేయాస్ అని నమ్మించే ప్రయత్నం చేశారని చెప్పాను. అతనే శ్రేయాస్ అని నేను ఎక్కడా చెప్పలేదు. తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు’ అని పేర్కొన్నారు.
స్పందించిన శ్రేయాస్..
ఇదిలాఉంటే.. రెండు రోజులుగా శ్రేయాస్ పేరుపై జరుగుతున్నవివాదానికి సంబంధఙంత మేనేజర్ శ్రేయాస్ ఎట్టకేలకు స్పందించాడు. సోషల్‌మీడియా ద్వారా ఓ పోస్టు పెట్టారు. వండర్‌బార్ ఫిలిమ్స్ పేరుతో నకిలీ కాస్టింగ్ కాల్స్, మెసేజ్‌లు, నటులకు ఆఫర్లు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో సంస్థ డైరెక్టర్ శ్రేయాస్ వివరణ ఇచ్చారు. ఇప్పటికే 2024 జనవరి 31, 2025 ఫిబ్రవరి 19 తేదీల్లో ఈ విషయంపై స్పష్టతనిచ్చినప్పటికీ, మోసాలు ఆగకపోవడంతో మళ్లీ అధికారిక నోటీసును విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఇందులో.. శ్రేయాస్ తన పేరుతో లేదా వండర్‌బార్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఎవరు చేసినా అలాంటి కాస్టింగ్ కాల్స్, సందేశాలు, ఆఫర్లు పూర్తిగా నకిలీ అని. ఈ మోసపూరిత చర్యల్లో ఉపయోగిస్తోన్న +91 75987 46841, 917598756841 నంబర్లు తనవి కావని, తన ఫోటోను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇటువంటి నకిలీ అవకాశాలను నమ్మి ఎవ్వరూ మోసపోవద్దని శ్రేయాస్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు.