Mamitha Baiju: ‘డ్యూడ్’లో.. ఆ సన్నివేశాలు సవాలు అనిపించాయి
ABN, Publish Date - Oct 14 , 2025 | 09:45 AM
‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు కొత్తగా ‘డ్యూడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది.
‘ప్రేమలు’ (Premalu) చిత్రంతో ఘన విజయం సొంతం చేసుకున్న మమిత బైజు (Mamitha Baiju) తాజాగా ‘డ్యూడ్’ (Dude) లో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) సరసన కథానాయికగా నటించారు.
ఈ చిత్రంతో కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బేనర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈనెల 17న తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా మమిత బైజు మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ‘‘డ్యూడ్’లో నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. మునుపెన్నడూ చేయని ‘కురల్’ అనే పాత్రలో కనిపిస్తాను. ఆమె తన భావోద్వేగాల పట్ల నిబద్ధతగా, తన చుట్టూ ఉన్న వారందరితో స్నేహంగా ఉంటుంది. ఈ పాత్ర పోషించడం నాకు ఓ గొప్ప అనుభవం.
ఈ చిత్రంలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలు నాకు సవాలుగా అనిపించాయి. వాటి కోసం రాత్రంతా డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా సన్నివేశాలపై దృష్టి కేంద్రీకరించాను.
ప్రదీప్‌తో కలిసి నటించడం ఓ గొప్ప అనుభూతి. సాయి అభ్యంకర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పాటలన్నీ మనసుని ఆకట్టుకుంటాయి’ అని తెలిపారు.