Kuberaa: లాజిక్ మిస్.. వీటికి జవాబేది కుబేర?
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:51 AM
గతవారం థియేటర్లలోకి వచ్చిన చిత్రం కుబేరా. పాజిటివ్ టాక్‌తో రన్ అవుతూ అంచనాలను మించి వసూళ్ళను సాధిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు.
నాగార్జున (nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక (Rashmika mandanna) కాంబోలో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కి గతవారం థియేటర్లలోకి వచ్చిన చిత్రం కుబేరా (Kuberaa). పాజిటివ్ టాక్‌తో రన్ అవుతూ అంచనాలను మించి వసూళ్ళను సాధిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. విడుదల కాగానే మూవీ అదిరిపోయిందని, అసలు ఇలాంటి సినిమాను ఎక్స్పర్ట్ చేయలేదంటూ పలువురు ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ములను ఆకాశానికెత్తేశారు.
మరి కొంతమంది మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తూ సినిమాను సునిశితంగా విమర్శిస్తున్నారు. సినిమాలో మిస్సయిన లాజిక్స్ గురించి ప్రశ్నిస్తున్నారు. కొందరు ఈ చిత్రం ప్రస్తుత బీజేపీ పాలనను టార్గెట్ చేసినట్లు ఉందని కూడా అనేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ కుబేరాకి 13 ప్రశ్నలు అంటూ తన సందేహాలను వ్యక్తం చేయగా... ఇప్పుడవి సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన వారు అధికులు నిజమే కదా అని అంటుంటే.. మరికొందరు సినిమాను సినిమాలానే చూడాలంటూ హితవు పలుకుతున్నారు. మరి ఆ నెటిజన్ ప్రశ్నలు ఏమిటో మీరూ ఓ లుక్కేయండి..
కుబేరాకి 13 ప్రశ్నలు
1.బంగాళాఖాతంలో ఆయిల్ పడుతుంది. దాన్ని స్వాధీనం చేసుకోడానికి నీరజ్ అనే వ్యాపారి ప్రభుత్వ పెద్దలకి లక్ష కోట్లు లంచం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. నీరజ్ ఎవరు? దేశంలో ఆయన్ని తెలియని వారు లేరు. లక్ష మంది ఉద్యోగులున్న కంపెనీలకీ యజమాని. ఆయన కింద ఎంత మంది చార్టెర్డ్ అకౌంటెంట్లు వుంటారో , ఏ రేంజ్ ఫైనాన్స్ నిపుణులు వుంటారో ఊహించుకోవచ్చు. ఆ రేంజ్‌కి చేరుకోవాలంటే గవర్నమెంట్లో ఎందరిని, ఎలా మేనేజ్ చేయాలో తెలియని అమాయకుడు కాదు. అయినా కొత్తగా అప్పుడే ఏదో డీల్ వచ్చినట్టు, తండ్రి చెప్పిన మాటలు విని, జైల్లో ఉన్న సీబీఐ అధికారిని , కేసు నుంచి విడిపించి మరీ లక్ష కోట్ల డీల్ అప్పచెబుతాడు. డబ్బులిస్తే అన్ని విలువల్ని వదిలేసుకునే సమస్త యంత్రాంగం చుట్టూ వుంటే, అందర్నీ వదిలి, విలువల గురించి మాట్లాడే నాగార్జునను తెచ్చుకుని, కొరివితో తల గోక్కుంటాడా? సినిమాటిక్ లిబర్టీ అంటారా!
2.నాగార్జున విషయానికి వద్దాం. సీబీఐ అధికారి కావాలంటే చాలా చదివి వుండాలి. అధికారం ఉన్నపుడు విలువలకి కట్టుబడి వుండాలంటే చాలా నైతిక శక్తి కావాలి. నీరజ్ ఎంత శక్తిమంతుడో తెలిసి కూడా , దాడి చేసి ఫైన్ కట్టించాడంటే ఎంతో నిబద్ధత కావాలి. ముక్కుసూటిగా పనిచేస్తే ఎన్ని శక్తులు తనమీద పగ పడతాయో తెలియని అమాయకుడు కాదు. అయినా నిజాయితీగా చేసి జైలుకెళ్లాడు. కోర్టులో న్యాయం జరగలేదు. భార్యాబిడ్డల వైపు మొగ్గి , నీరజ్‌కు లొంగిపోయాడు. మనీల్యాండరింగ్ , షెల్ కంపెనీలు, ఫైనాన్స్ ఎక్స్‌ఫర్ట్‌ల పని. కానీ నీరజ్ గొర్రెలా సీబీఐ మాజీ అధికారిని ఎంచుకున్నాడు. సినిమా లిబర్టీ ఓకే. నాగార్జున చేసిందేమంటే నలుగురు బిచ్చగాళ్లని వెతికి పట్టుకోవడం. దీనికి నలుగురు ఎందుకు? ఒకడితోనే లాగించొచ్చు. కానీ క్లైమాక్స్‌కి ఖుష్బు , ఆమె కొడుకు అవసరం. ఇది దర్శకుడి లిబర్టీ. బిచ్చగాళ్లని తెచ్చి , కటింగ్ చేసి, గడ్డాలు తీసి, కోటు వేసి, సీఈవోని చేసి రోబో అనే వాడి చేతిలో హత్య చేయించడం ఇదంతా ఓవర్‌గా లేదా? శేఖర్ కమ్ములకి తెలియనిది ఏమంటే డబ్బున్న వాళ్లందరూ డ్రైవర్లని, తోటమాలీలు, వాచ్‌మెన్లని బినామీలుగా పెట్టుకుంటారు. దోవలో పోయే బిచ్చగాళ్లని ట్రైనింగ్ చేయించరు. నీ పేరు మీద క్షణాల్లో కోట్ల రూపాయిలు బ్యాంక్ బ్యాలెన్స్ సృష్టించి, అమెరికా ప్రయాణం చేయించగల నిపుణులు అమీర్‌పేటలోనే ఉన్నారు. అబిడ్స్, కోఠిలో మామూలు వ్యాపారులకి కూడా హవాలా, మనీ ల్యాండరింగ్ తెలుసు. శేఖర్ సార్ పద్మారావునగర్‌లో వుండి, అదే ప్రపంచం అనుకుంటున్నారు.
3.ధనుష్ ఒక బిచ్చగాడు. చదువులేదు కానీ, తెలివి వుంది. జ్ఞాపక శక్తి వుంది. మనిషిగా విలువలున్నాయి. బాల్యం ఒక గాయం. అలాంటి వాడు కష్టపడి పని చేసుకుంటాడు కానీ, బిచ్చగాడిగా ఎందుకుంటాడు? మరు జన్మలో బిచ్చగాడిగా వుండడానికే ఇష్టపడని వాడు , ఇపుడు బిచ్చగాడిగా ఎందుకున్నాడు? ఉన్నాడనే అనుకుంటే ఎవరో ముక్కూమొహం తెలియని వాళ్లు, డబ్బులిస్తామని చెబితే వెళ్తాడా? సూటు బూటు వేసి, సంతకం చేయమంటే తెలివైన వాడికి కొంచెమైనా అనుమానం రాదా? రాలేదనే అనుకుందాం. ఇంతకీ అతని డబ్బు ఎందుకు ట్రాన్స్ఫర్ కాలేదు?
4.ఇవన్నీ పక్కన పెడితే, ఓల్డ్‌మాంక్ పేరు చెప్పి ఎవడైనా ప్లాట్‌లోకి వెళ్లగలిగే ఇంట్లో బోలెడు డబ్బు, బంగారం దాచిన అధికారి ఎంత అమాయకుడు? అసలు అతని కథ ఏంటి?
5.బ్యాంకింగ్ అవగాహనే లేని ధనుష్ ఒక ట్రక్కు నిండా నోట్ల కట్టలని విలన్ ఇంటి ముందు ఎలా వేసాడు?
6.నంబర్ వన్ బిజినెస్ టైకూన్, ఒక బిచ్చగాడిని హ్యాండిల్ చేయలేక బిచ్చగాడిగా మారిపోతాడా?
7.ఎవరో తెలియని ఖుష్బూని రక్షించిన నాగార్జున ఒక సిన్సియర్ పోలీస్ అధికారి షాయాజీ షిండేని ఎందుకు కాల్చి చంపుతాడు?
8.సినిమాలో రష్మికనే కొంచెం సహజంగా వుంది. కానీ బిచ్చగాడిని నమ్మి అన్ని రిస్క్‌లు తీసుకోవడం కొంచెం అసహజం.
9.శేఖర్ కమ్ముల ఒక కంగాళీ సినిమాని తీస్తే, కారణాలు ఏమైతేనేం అందరూ భుజాలకెత్తుకుంటున్నారు. నా లాంటి అజ్ఞానులకే సమస్య.
10.చివరిగా .. శేఖర్ సార్ మీ అభిమానిగా చెబుతున్నా. మీరొక మంచి సినిమా తీయాలనుకుని తీయలేకపోయారు. ఆహా, ఓహో భుజకీర్తుల్ని నమ్మకండి. అవి దేవతా వస్త్రాలు.
11.ధనుష్ నోట్ల కట్టలు ఇచ్చి అంతిమ యాత్ర చేసినా , బండెడు నోట్ల కట్టలు రోడ్డు మీద కుమ్మరించినా, మీడియా , సోషల్ మీడియా ఏమై పోయాయి? అసలు ఈ సినిమా ఏ కాలం నాటిది?
12.డబ్బున్న వాళ్లదే న్యాయం. వాళ్లు పేదవాళ్లతో ఆడుకుంటారు, వాడుకుంటారు. నిజమే. టికెట్ రేట్లని పెంచి మీరు చేస్తున్నదేంటి? దోపిడీ కాకుండా వేరే పదం ఏమైనా వుందా?
13.శేఖర్ కమ్ముల రూ.150 కోట్లతో జూదం ఆడారు. మీరు మంచి అటగాడే కానీ ముక్కలు పడలేదు.
Next time better luck (జీఆర్ మహర్షి వాల్ నుంచి సేకరణ)