Narivetta OTT: ఓటీటీకి.. టొవినో థామస్ తొడేలు వేట! ఎప్పటి నుంచంటే
ABN, Publish Date - Jul 03 , 2025 | 05:04 PM
టొవినో థామస్ రీసెంట్‌గా నటించిన మలయాళ చిత్రం నరివెట్ట డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.
తరుచూ విభిన్న చిత్రాలతో క్రమంగా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్న మలయాళ అగ్ర నటుడు టొవినో థామస్ (Tovino Thomas) ఏఆర్ఎమ్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నటించిన చిత్రం నరివెట్ట (Narivetta). మే23న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించడమే గాక విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అనురాజ్ మనోహర్ (Anuraj Manohar) దర్వకత్వం వహించిన ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు (Suraj Venjaramoodu), తమిళ దర్శక నటుడు చేరన్ (Cheran), ప్రియం వద కృష్ణన్ (Priyamvada Krishnan) కీలక పాత్రలు పోషించారు.
కాగా.. కేరళలో విడుదలైన తర్వాత నరివెట్ట తోడేలు వేట పేరుతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను విడుదల చేసింది. అయితే సరైన ప్రచారం లేక ఈ చిత్రం అసలు విడుదలైన సంగతి కూడా తెలియక ప్రజలకు చేరలేక పోయింది. అయితే.. ఇప్పుడీ మూవీ 50 రోజుల తర్వాత ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. 2003వ సంవత్సరంలో కేరళలోని ముత్తంగ అనే ఆటవీ ప్రాంతంలో ఆదివాసిలపై పోలీసులు జరిపిన ఊచకోత నేపథ్యంలో నాటి నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్టాప్‌లో అంతా హీరో హీరోయిన్ల మధ్య లవ్ డ్రామా కాస్త విసుగు తెప్పించినప్పటికీ, ఆ తర్వాత హీరో వర్గీస్ పీటర్ అయిష్టంగా కానిస్టేబుల్‌గా డ్యూటీలో చేరినప్పటి నుంచి కథ పరుగులు పెడుతుంది.
ఆడవిలో అక్రమంగా ఉంటున్న ట్రైబల్స్‌ను అక్కడి నుంచి వెళ్లగొట్టి ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం చూస్తుంటుంది. కానీ అక్కడ నివసిస్తున్న గిరిజనులు అందుకు అంగీకరించక పోలీసులకు ఎదురు తిరగడంతో అల్లర్లు జరుగుతాయి. ఆ సమయంలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుల్ వర్గీస్ పీటర్ షూట్ చేయడంతో ఓ గిరిజన వ్యక్తి చనిపోతాడు. దీంతో పోలీసులు ఆ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి కేసులు పెడతారు. ఈ నేపథ్యలో అసలు ఆ మర్డర్ వర్గీస్ చేశాడా, లేక ఎవరైనా ఇరికించారా ఇంతకు అతన్ని ఎందుకు షూట్ చేశారు, చివరకు హీరో ఏం చేశాడనే ఆసక్తికర కథనంతో సినిమా సాగుతూ చూసే వారికి అదిరిపోయే థ్రిల్‌ను ఇస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హీరో నటన గూస్‌బంప్స్ తెప్పించడమే కాక నాటి నర మేథం దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూయించడంతో సినిమా చూసిన వారంతా తీవ్ర భావోద్వేగాలకు లోనవుతారు.
ఇదిలాఉంటే.. ఇప్పుడీ నరివెట్ట (Narivetta) సినిమాను జూలై 11న స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ ఓ రోజు ముందుగానే అంటే జూలై 10 గురువారం మధ్యాహ్నం నుంచి సోనీ లివ్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. ఎవరైతే థియేటర్‌లో ఈ చిత్రాన్ని మిస్సయ్యారో, ఇంకా టొవినో థామస్, మలయాళ సినిమాలు ఎట్టి పరిస్తితుల్లోనూ మిస్ అవకుండా చూసి తీరాల్సిన మూవీ ఇది. ఫ్యామిలీ అంతా కలిసి వీక్షించవచ్చు. ఇప్పుడే మీ మస్ట్ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి.