Mirai OTT: ‘మిరాయ్’ యోధ.. ఓటీటీకి వచ్చేశాడు! ఇంటిల్లి పాదికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్
ABN, Publish Date - Oct 10 , 2025 | 06:02 AM
‘హను-మ్యాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా తన తదుపరి చిత్రం ‘మిరాయ్’ తో ప్రేక్షకుల ఎదుటకు వచ్చాడు.
గత సంవత్సరం ‘హను-మ్యాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా(Teja Sajja) తన తదుపరి చిత్రం ‘మిరాయ్’ (Mirai) తో ప్రేక్షకుల ఎదుటకు వచ్చాడు. పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడి సెప్టెంబర్ 5న విడుదలైన ఈ పాన్ ఇండియా ఫాంటసీ చిత్రం, భారీ విజయాన్ని సాధించింది. మంచు మనోజ్(Manoj Manchu), రితికా నాయక్ (Ritika Nayak), శ్రీయ, జగపతి బాబు, జయరాం కీలక పాత్రల్లో నటించారు. ఈగల్ సినిమా తర్వాత కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) దర్శకత్వం వహించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది చాలా కాలం తర్వాత అదిరిపోయే హిట్ సాధించారు. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. మహా రాజు అశోకుడు కళింగ యుద్ధంతో జరిగిన రక్తపాతం చూసి ఆలోచనలో పడి తన జ్ఞానాన్ని తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేసి. తొమ్మిది మంది యోధులకు అప్పగిస్తాడు. వాటిని దక్కించుకోడానికి తరాలుగా అనేక మంది ప్రయత్నించినా విఫలమవుతారు. చివరకు ప్రస్తుతానికి వస్తే, తాంత్రిక విద్యలు వచ్చిన (మంచు మనోజ్) బ్లాక్ స్వార్డ్ ఆ ఎనిమిది గ్రంథాలు దక్కించుకుంటాడు. కానీ చివరి గ్రంథాన్ని దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతాడు. ఆ గ్రంథాన్ని అంబిక (శ్రియా శరణ్) రక్షిస్తుంది. తన కుమారుడు వేద ప్రజాపతి (తేజ సజ్జా) ద్వారా బ్లాక్ స్వార్డుని నిలువరించవచ్చని తెలుసుకున్న ఆమె, వేదను పుట్టిన వెంటనే కాశీలో భగవంతుని చెంత వదిలేస్తుంది.
కాశీలో ఒంటరిగా పెరిగిన వేద, తన అసలు లక్ష్యం ఏమిటో తెలియక జీవితం గడిపిపోతుంటాడు. ఒక సమయంలో విభ (రిథికా నాయక్) అనే యువతితో పరిచయం అవుతుంది. ఆమె వల్లే వేద జీవితంలో మార్పు వస్తుంది. వేద తన మీదే నమ్మకం లేకున్నా, ప్రజల కోసం బ్లాక్ స్వార్డ్‌కి వ్యతిరేకంగా ఎలా పోరాడాడు? శ్రీరాముని ఆశీస్సులతో అతనికి దివ్య ఆయుధం ‘మిరాయ్’ ఎలా దక్కింది? అన్నదే కథ. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, సినిమాటోగ్రఫీ కూడా తానే నిర్వహించి ఈ చిత్రాన్ని గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా తీర్చిదిద్దారు. వీడియో ఎఫెక్ట్స్ (VFX), ఆర్ట్ డైరెక్షన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ – అన్నీ కూడా సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. అంతేగాక గౌరహరి సంగీతం, ముఖ్యంగా క్లైమాక్స్ లో వినిపించే నేపథ్య గీతం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ ఇస్తుందనడంలో సందేహం లేదు.
తేజ సజ్జా నేచురల్ యాక్టింగ్ ఫ్లస్ కాగా మంచు మనోజ్ విలన్ పాత్రలో అదిరిపోయాడు. కొన్ని సీన్స్‌లో హీరో కంటే ఎక్కువ హైలైట్ అయ్యాడు. శ్రియా శరణ్ కీలక పాత్రతో మెప్పించింది. జయరాం పాత్ర మొదట్లో సీరియస్‌గా, తర్వాత హాస్యంగా మారడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కాకపోతే.. జగపతి బాబు పాత్రలో మరింత డెప్త్ ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ సినిమా జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్ లో మిస్ అయినవాళ్లకు ఇది మంచి అవకాశం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ చూడొచ్చు. ఇంట్లో కుటుంబంతో కలసి చూసే అద్భుతమైన మైథలాజికల్ ఫాంటసీ మూవీ ఇది. ఇక.. క్లైమాక్స్‌లో రానా దగ్గుబాటి గెస్ట్ రోల్‌తో పెద్ద మైథో ఫాంటసీ యూనివర్స్ మొదలవుతుందని లీడ్ ఇచ్చారు. మీరు ఇంకా చూడకపోతే.. ఇప్పుడే హాట్‌స్టార్ ఓపెన్ చేసి మిరాయ్‌ని చూసేయండి!