The Bhootnii: ఓటీటీలో.. సంజయ్ దత్ హర్రర్, కామెడీ! దెబ్బకు దయ్యం వదులుద్ది
ABN, Publish Date - Jul 19 , 2025 | 05:46 PM
రెండు నెలల క్రితం మే1న థియేటర్లకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న చిత్రం ది భూత్నీ
రెండు నెలల క్రితం మే1న థియేటర్లకు వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకున్న చిత్రం ది భూత్నీ (The Bhootnii). బాలీవుడ్ ఆగ్ర హీరో సంజయ్ దత్ (Sanjay Dutt) స్వయంగా నిర్మించిన ఈ సినిమాకు సిద్దాంత్ సచ్‌దేవ్ (Sidhaant Sachdev) రచించి దర్శకత్వం వహించాడు. ఇప్పుడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇంకా ఈ చిత్రంలో మౌనీ రాయ్ (Mouni Roy), సన్నీ సింగ్, పలక్ తివారీ (Palak Tiwari), నికుంజ్ లోథియా (Nikunj Lotia), అషీఫ్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే.. ఓ కాలేజీలో లవ్ ట్రీ ఉంటుంది. దానిపైనే ఓ ఆగ దయ్యం కూడా ఉంటుంది. అయితే.. ఎవరైనా ఆ చెట్టు వద్దకు వెళ్లి తమ ప్రేమ గురించి కోరుకుంటే అవి ఫలిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ రోజు శంతను అనే కుర్రాడు అ చెట్టు కిందకు వెళ్లి తన ప్రేమ గురించి చెప్పగా ఆ చెట్టుపై ఉన్న దయ్యం స్వయంగా వచ్చి అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆ దయ్యాన్ని వదిలించేందు కు స్పెషలిస్ట్ సంజు బాబాను పిలిపిస్తారు. ఈ నేపథ్యంలో సంజు బాబా ఆ దయ్యాన్ని వదిలించాడా లేదా, ఇంతకు ఆ దయ్యం ఆ చెట్టుపై ఎందుకుంది, ఇదివరకు ఎంతమందిని ప్రేమించింది, ఆ దయ్యానికి, సంజు బాబాకి మధ్య ఉన్న లింకేంటి అనే పాయింట్‌తో సినిమా సాగుతుంది.
సినిమా అసాంతం సింగిల్ లైన్ పంచులతో, కామెడీ తరహాలో సాగుతూ రొటీన్ సినిమాలానే అనిపిస్తుంది. ఒక్కోసారి చిరాకు వచ్చి లేచి వెళ్లి పోదామనే సన్నివేశాలు కూడా ఎదురవుతాయి. అంతలా ఈ సినిమా చూసే వారికి ఒక్కొక్కరికి ఒకలా అనిపిస్తుంటుంది. సంజయ్‌దత్ అంటే ఇష్టపడే వారు, హర్రర్, కావాలనుకునే వారు ఒక్కసారి ఈ సినిమాను చూసేందుకు ప్రయత్నించవచ్చు. ఇప్పుడీ ది భూత్నీ (The Bhootnii) చిత్రం జీ5 (ZEE 5) ఓటీటీలో కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.