Saree OTT: సడన్‌గా.. ఓటీటీకి ఆర్జీవీ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్!
ABN, Publish Date - Jun 26 , 2025 | 07:06 PM
రాంగోపాల్ వర్మ పొలిటికల్ సినిమాలకు ఎండ్ కార్డ్ వేసి తిరిగి తన రొమాంటిక్ రూట్‌లోకి వెళ్లి నిర్మించిన ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘శారీ’.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) పొలిటికల్ సినిమాలకు ఎండ్ కార్డ్ వేసి తిరిగి తన రొమాంటిక్ రూట్‌లోకి వెళ్లి తన డెన్ ఆర్వీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘శారీ’ (SAAREE). సత్య యాదు (SatyaYadu) హీరోగా సోషల్ మీడియా సెన్షేషన్ ఆరాధ్య దేవి (Aaradhya Devi)ని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని రూపొందించారు. తన శిష్యుడు గిరి కృష్ణ కమల్ (Giri Krishna Kamal) ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా ఏప్రిల్4న తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లోవిడుదల చేశారు. అయితే సుమారు ముడు నెలల తర్వాత ఇన్నాళ్లకు ఈ సినిమా చడీచప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాకిచ్చింది.
కథ విషయానికి వస్తే.. చీర కట్టుకోవడం అంటే ఇష్టమైన ఆరాధ్య ఎప్పుడు బయటకు వెళ్ళినా శారీలోనే వెళుతుంది. ఒకానొక సమయంలో ఆమెను చూసిన ఫోటోగ్రాఫర్ కిట్టు ప్రేమలో పడతాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని ఆమెతో ఫోటో షూట్ చేస్తానని చెబుతాడు. మరోవైపు ఆరాధ్య రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని ఇష్టపడని అన్నయ్య రాజ్ ఆమెను వారిస్తూ ఉంటాడు. కానీ కిట్టు ఫోటో షూట్‌కు ఆరాధ్య అంగీకరిస్తుంది. అయితే కిట్టు ప్రవర్తన నచ్చక రాజ్ అతనికి వార్నింగ్ ఇస్తాడు. తనకు ఆరాధ్యకు మధ్య రాజ్ అడ్డుగా నిలబడడాన్ని కిట్టు తట్టుకోలేక సైకోగా మారిపోయి.. రాజ్ ను హతమార్చాలనుకుంటాడు. ఆరాధ్య కోసం పిచ్చివాడిగా మారిన కిట్టు ఏం చేశాడు? అతని విపరీత ధోరణికి ఆరాధ్య అట్టుకట్ట వేయగలిందా? అందంగా చీర కట్టుకోవాలనే తన కోరిక కారణంగా ఎదురైన ఇబ్బందుల్ని ఆమె ఎలా ఎదుర్కొంది? అనేదే ఈ మూవీ స్టోరి.
అతి ప్రేమ ఎంత భయంకరంగా ఉంటుంది, సోషల్ మీడియాలో మనం చేసే పొరపాట్లు అపై అవి ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుందనే పాయింట్ చెప్పడానికి ఈ సినిమా తీశారు. అయితే 2 గంటల 20 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా మొత్తం నాలుగైదు పాత్రల చుట్టే తిరుగుతూ మూవీ చూసే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఆరాధ్య దేవి, లవర్ కనిపిస్తూనే ఉంటారు. అంతేకాదు ప్రతా పావుగంటకోటి చొప్పున శృతిమించిన అందాల ప్రదర్శనలతో చిత్రీకరించిన రొమాంటిక్ పాటలు మగవాళ్లే అబ్బా అనుకునేలా చేస్తాయి. పైగా క్లయిమాక్స్ లో వచ్చే మితిమీరిన వయొలెన్స్ మర్డర్ సీన్స్ ఇబ్బంది పెడతాయి. ఇప్పుడీ ‘శారీ’ (SAAREE) సినిమా లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీతో ఈ చిత్రాన్ని చూడడం చాలా కష్టం. మగవాళ్లు మాత్రమే అది కూడా ఏ పని పాట లేని సమయంలో అలా ఒకసారి చూసి వదిలేసే వాళ్లైతే ప్రయత్నించవచ్చు.