OTT: కోట్ల జీతం.. కానీ హీరో ఉండ‌లేడు.. పారిపోలేడు! ఓటీటీలో దిమ్మ తిరిగే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ ! ఎందులో ఉందంటే?

ABN, Publish Date - May 02 , 2025 | 07:11 PM

గ‌త సంవ‌త్స‌రం ఓటీటీలో విడుద‌లై అంత‌గా ప్ర‌జాద‌ర‌ణ ద‌క్కించుకోని హాలీవుడ్ థ్రిల్ల‌ర్ చిత్రం వాట్ యూ విష్ ఫ‌ర్‌.ఈ సినిమా విష‌యంలో మీరు ఊహించ‌లేని విధంగా ఉండ‌డం ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌.

what

గ‌త సంవ‌త్స‌రం ఓటీటీలో విడుద‌లై అంత‌గా ప్ర‌జాద‌ర‌ణ ద‌క్కించుకోని హాలీవుడ్ థ్రిల్ల‌ర్ చిత్రం వాట్ యూ విష్ ఫ‌ర్‌.ఈ సినిమా విష‌యంలో మీరు ఊహించ‌లేని విధంగా ఉండ‌డం ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌. పైన పోస్ట‌ర్‌లో మీరు చూసిన దానికి ఇప్పుడు ఇక్క‌డ‌ చ‌ద‌వ‌బోయే దానికి న‌క్క‌కు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. పైన ఫొటో చూసి ఇదేదో సైలెంట్, క్రైమ్ థ్రిల్ల‌ర్‌, హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ అని అనుకుంటే మీఈరు ప‌ప్పులోనే కాదు ఉప్పులోనూ కాలు వేసిన‌ట్లే లెక్క‌. ఇదేది తెలియ‌కుండా సినిమా చూసిన వారు ఓ సీన్ వ‌ర‌కు పోయాక గానీ అస‌లు విష‌యం బోధ ప‌డ‌దు.

గ‌తేడాది మే3 థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ వాట్ యూ విష్ ఫ‌ర్‌ సినిమాలో నిక్ స్టాల్ (Nick Stahl), టామ్సిన్ టోపోల్స్కీ (Tamsin Topolski), రాండీ వాస్క్వెజ్ (Randy Vasquez), పెనెలోప్ మిచెల్ (Penelope Mitchell) కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా నికోలస్ టామ్నే (Nicholas Tomnay) ర‌చించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు తానే స్వ‌యంగా నిర్మించాడు. కేవ‌ల నాలుగైదు పాత్ర‌ల చుట్టూనే ఈ సినిమా సాగుతూ చూసే ప్రేక్ష‌కుల‌కు ముగింపు వ‌ర‌కు అదిరిపోయే ఫీల్‌ను ఇస్తుంది.


ఇక క‌థ విష‌యానికి వ‌స్తే అమెరికాలో నివ‌సించే ర్యాన్ మంచి ప‌నిత‌నం ఉన్న చెఫ్‌. అయితే గ్యాంబ్లింగ్ డ‌బ్బులు పొగొట్టుకుని తీవ్ర అప్పుల్లో కూరుకు పోతాడు. ఆపై అప్పులు ఇచ్చిన వాళ్లు త‌రుచూ వెంట‌ప‌డ‌డం, బెదిరిస్తుండ‌డంతో కొలంబియాలోని ఓ ఖ‌రీదైన‌ ఎస్టేట్‌లో చెఫ్‌గా ప‌ని చేస్తున్న త‌న మిత్రుని ద‌గ్గ‌ర‌కు పారిపోయి బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌కుండా త‌ల‌దాచుకుంటాడు. అయితే ఓ రోజు ర్యాన్ నిద్ర నుంచి లేచి చూసే స‌రికి త‌న మిత్రుడు ఆత్మ‌హ‌త్య చేసుకుని క‌నిపిస్తాడు. అదే స‌మ‌యంలో ఆ ఎస్టేట్ ఓన‌ర్ ఫోన్ చేసి నాటుగైదు దేశాల నుంచి బిలియ‌నీర్స్ అయిన‌ అతిథులు వ‌స్తున్నారు వంట‌లు చేయ‌డానికి రెడీగా ఉండాలి, ఎస్టేట్‌ను క్లీన్ చేసి ఉంచాల‌ని చెబుతాడు. ర్యాన్‌కు ఏం చేయాలో తెలియ‌క త‌న మిత్రుడి పేరును త‌న పేరుగా చెప్పి అక్క‌డ ఉండిపోతాడు.

ఆపై ఓన‌ర్, అతిథులు రావ‌డం ర్యాన్ వారికి వంట‌లు చేసి పెడుతూ మంచి పేరు తెచ్చుకుంటాడు. స‌డ‌న్‌గా ఓ రోజు ఓ డిటెక్టివ్ అ ఎస్టేట్‌కు వ‌చ్చి స‌మీపం విలేజ్‌లోని వ్య‌క్తి క‌నిపించ‌డం లేదంటూ ఇక్క‌డ‌కు ఏమైనా వ‌చ్చాడా అని ఎంక్వైరీ చేస్తున్నామ‌ని స‌హ‌క‌రించాల‌ని అంటాడు. అక్క‌డ ఒక‌టి రెండు సంఘ‌ట‌న‌లు అనుమానాస్ప‌దంగా తోడంతో డిటెక్టివ్ అక్క‌డే క‌లియ తిరుగుతూ ఉంటాడు, అక్క‌డి గెస్టుల‌ను క‌లుసుకుని ప్ర‌త్యేక డిన్న‌ర్ సైతం చేస్తారు. త‌ర్వాత జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో అ డిటెక్టివ్ చ‌నిపోతాడు. ఈక్ర‌మంలో త‌రువాత ఏం జ‌రిగింది, ఆ మిస్ అయిన విలేజ్ వ్య‌క్తి ఎవ‌రు, ఎలా మిస్స‌య్యాడు, అత‌నికి డిటెక్టివ్‌కు ఏం సంబంధం, అస‌లు వీదేశీయులు ఆ ఎస్టేట్‌కు ఎందుకు వ‌చ్చారు, అక్క‌డ జ‌రిగే తంతేంటి, ర్యాన్ ఏం చేశాడు, అక్క‌డి నుంచి బ‌య‌ట ప‌డ‌గ‌లిగాడా లేదా అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల చుట్టూ తిరుగుతుంది.

అయితే.. ప్రేక్ష‌కుల‌కు థ్రిల్ మిస్స‌వ‌కూడ‌ద‌నే ఉద్ధేశంతో అస‌లు కీ పాయింట్‌ను ఇక్క‌డ రివీల్ చేయ‌డం లేదు. అది చూసి తెలుసుకుంటేనే మీకు సినిమా తృప్తిని ఇస్తుంది. కానీ త‌ర్వాత ఈ సినిమా ఇచ్చే థ్రిల్ వారం పాటు మైండ్‌లోంచి పోదంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌స్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime VIdeo) ఓటీటీలో ఉంది. తెలుగు భాష‌లోనూ అందుబాటులో ఉంది. ఎక్క‌డ అశ్లీల స‌న్నివేశాలు ఉండ‌వు గానీ కాస్త ధృడ హృద‌యం ఉన్న వారు, పెద్ద వారు మాత్ర‌మే చూడ‌డం శ్రేయ‌స్క‌రం.

Updated Date - May 02 , 2025 | 07:11 PM