Retro: ఎంటీ.. ‘రెట్రో’ ఆ మూడు సినిమాలకు కాపీనా
ABN , Publish Date - May 02 , 2025 | 04:53 PM
కంగువా వంటి భారీ డిజాస్టర్ తర్వాత సూర్య నుంచి వచ్చిన కొత్త చిత్రం రెట్రో. కార్తిక్ సుబ్బురాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా పూజా హేగ్డే, జయరాం, జోజు జార్జ్ కీలక పాత్రలో నటించారు. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించక పోగా కొన్ని తెలుగు పాత సినిమా స్టోరీలను కాపీ చేసి తీశారంటూ కామెంట్లు వస్తున్నాయి.
కంగువా వంటి భారీ డిజాస్టర్ తర్వాత సూర్య (Suriya) నుంచి వచ్చిన కొత్త చిత్రం రెట్రో (Retro). కార్తిక్ సుబ్బురాజ్ (Retro) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా పూజా హేగ్డే, జయరాం, జోజు జార్జ్ కీలక పాత్రలో నటించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. మే1 గురువారం నాని హిట్3కి పోటీగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా విఫలమైంది. సినిమా ప్రకటించడమే తరువాయి కంగువా విడుదలకు ముందే నెల పదిహేను రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని ప్యాకప్ చెప్పిన ఈ మూవీ ఇప్పుడు అంతే త్వరగా థియేటర్ల నుంచి తీసేయాల్సిన స్థితికి చేరింది.
సినిమాకు రెట్రో అనే టైటిల్ పెట్టిన నాటి నుంచే ఎక్కడో కొడుతుంది, ఏదో మిస్ అవుతుందని అభిమానుల్లో వచ్చిన అనుమానాలను నిజం చేస్తూ సినిమా ఉండడంతో ఫ్యాన్స్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. సినిమా స్టార్ట్ అయింది మొదలు అఫ్రికా, ఫ్రాన్స్ అంటూ చూయించి ఆపై ఇండియాకు తీసుకు వచ్చి చివరకు అండమాన్‌లో సినిమాను కలిపేశారు. ఏ పాత్ర ఎందుకు వస్తుందో, అప్పటి వరకు కనిపించని వారు అప్పటికప్పుడే సంబంధం పెట్టి పిలవడం, తరవాత ఆ పాత్ర గాయబ్ కావడం, ఏ పాత్ర ఎందుకు వస్తుందో అర్థం గాక అంతా కృతకమైన యాక్టింగ్‌తో గజిబిజీ గందరగోళంగా తయారైంది. ఎప్పుడు బయట పదడుదామురా అన్న ఫలింగ్ తెప్పించిందంటే అతిశయోక్తి కాదు. గత సంవత్సరం లారెన్స్‌తో జిగర్తాండ డబుల్ ఎక్స్ తీసి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న కార్తిక్ సుబ్బురాజే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడా అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలాఉంటే గేమ్ ఛేంజర్ సినిమాకు ఇచ్చిన కథే పాత సినిమాలను మిక్సీలో వేసి తిరిగి కొత్తగా ఇచ్చాడని అనిపించుకున్న కార్తీక్ సుబ్బురాజ్ ఇప్పుడు రెట్రో సినిమా విషయంలోనూ అలాంటి వార్తలనే మూట గట్టుకుంటున్నాడు. సూర్య తమ్ముడు కార్తీ నటించిన యుగానికి ఒక్కడు, తెలుగులో జూ.ఎన్టీఆర్ దమ్ము, వెంకటేశ్ జయం మనదేరా సినిమాల కథలను కాపీ చేసి ఇప్పుడు ఈ రెట్రో తెరకెక్కించాని విమర్శలు వస్తున్నాయి. ఆ సినిమాల్లో ఎక్కడో మూరుమూల ఊర్లో ఓ వ్యక్తి నియంతలా వ్యవహరిస్తూ, అక్కడి వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టడం, అదే సమయంలో తనకు గతం తెలియకుండానే హీరో అక్కడకు రావడం, ఆపై తన జన్మ రహస్యం తెలుసు కోవడం, చివరకు నియంతను అంతమొందించడంతో కథ ముగుస్తుంది. ఈ రెట్రో కథ కూడా అదే.
యుగానికి ఒక్కడు చిత్రంలో హీరోకు పుట్టుకుతో పులి బొమ్మ పుట్టుమచ్చగా ఉంటే సూర్యకు నెమలి బొమ్మ ఉండండం విశేషం. ఆ సినిమాలో కార్తీ అనామకుడిగా రహాస్య ప్రదేశానికి రావడం, చివరకు అతనే వారిని రక్షించే వ్యక్తిగా మరితే ఈ సినిమాలో సూర్య అండమాన్ అదివాసీల వద్దకు రావడం, తనకు తెలియకుండానే వాళ్లు తన వారని వారి కోసం అక్కడి కింగ్‌పై ఎదురు తిరగడం జరుగుతుంది.
ఇక దమ్ము సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఓ ఊరి నుంచి ఓ పిల్లాడిని వేరే వాళ్ల సాయంతో బయటకు పంపుతారు. ఆ పిల్లాడు ఎక్కడో పెరిగి, తనకు తెలియకుండానే తన సొంత ఊరికి వచ్చి, తన కుటుంబం గురించి తెలుసుకుని ఊరి ప్రజల ఇబ్బందులు తొలగిస్తాడు. ఇక జయం మనదేరాలో ఎపప్ఉడో వీదేశాలకు వెళ్లి తన ఊరికి అనుకోకుండా వచ్చి ఎన్నాళ్ల నుంచో ఉన్న కుటుంబ తగాదాల్లో చిక్కుకుని ప్రత్యర్థులను అంతమొందిస్తాడు. ఇలా రెట్రో సినిమా చూసిన వారికి మనం చూసిన చాలా సినిమాలు గుర్తుకు రాక మానవు.